లాక్ డౌన్ పుణ్యమాని,
పూజాగదిలో నున్న దేవుళ్ళముందర
ముకిళిత హస్తాలతో నిలుచుని
ఓ దేవుళ్ళారా ! ఓ దేవతలారా?
ఎక్కడున్నారు ? మీరేమయ్యారు?
కంటికే కనిపించక,
కాలసర్పమై ప్రపంచాన్ని
కాటు వేస్తున్న ఈ కరోనా
మహమ్మారి నుండి
ప్రజలందరిని కాపాడమని,ప్రార్థిస్తుంటే,
భక్తులారా ! భయపడకండి
భయబ్రాంతులకు గురికాకండి !
దైర్యంగా వుండండి!
దృడసంకల్పంతో వుండండి!
ఈ కరోనా కష్టాలు తొలిగి,
కారుమబ్బులు కరిగి,
చిమ్మచీకట్ల తెరలు చిరిగి,
వేయి సూర్యుళ్ళు ఒక్కసారి
వెలిగే రోజులు రానున్నాయని
కరోనాను ఖతంచేసే ఆయుధాలు
త్వరలో మీకు అందుతాయని
ముక్కోటి దేవుళ్ళు ముక్తకంఠంతో
దీవిస్తూ అందిస్తున్నారు "ఓ దివ్యసందేశం"
లాక్ డౌన్ పుణ్యమాని
బద్దకాన్ని వదిలి పెట్టినవారే వృద్దిచెందుతారని
సూర్యునికంటే ముందు లేచినవారే సుఖపడతారని
రోజు వాకింగ్,జాగింగ్,
వ్యాయామం యోగా చేసినవారే
ఆరోగ్యం ,ఆనందం, దీర్ఘాయుష్షను
మూడు వరాలను పొందుతారని,
ప్రొద్దుటే నిద్రలేసే అలవాటున్న
పక్షులన్నీ కమ్మని కిలకిలారావాలతో
అందిస్తున్నాయి"ఓ ఆరోగ్యసందేశం"
లాక్ డౌన్ పుణ్యమాని,
రోజూ,మాదుమ్మును దులిపేస్తే
మా పేజీల గుండెల్ని చీల్చేస్తే
మీకు విజ్ఞానపు గుప్తనిధులు దొరుకుతాయని,
అజ్ఞానాంధకారం తొలిగి
విజ్ఞానంతో బ్రతుకులు వికసిస్తాయని
బీరువాల్లో దుమ్ము కొట్టుకొనివున్న
రామాయణ, మహాభారత,
భాగవత, బైబిల్, భగవద్గీతలు
అందిస్తున్నాయి"ఓ ఆథ్యాత్మిక సందేశం"



