పుక్కిట పురాణం
ప్రతి నిత్యం
శ్మశానంలో ఏవేవో
తాంత్రిక పూజలు చేసే
ఓకపాల మాంత్రికుడు
తనను ఓ ప్రేతాత్మ
ఎగతాళి చేసినందుకు
కళ్ళెర్ర చేసి కసిగా
ఓసీ బొమ్మాళీ
నన్నే చేస్తావా ఎగతాళి
రావే రా బయటికిరా
నీ అంతుచూస్తానంటూ
ఆకాశం దద్దరిల్లేలా
వాడు పెట్టిన ఆ గావుకేకలకు
సమాధుల్లోని శవాలన్నీ
ఉలిక్కిపడి పైకిలేశాయట
ఉరుములు మెరుపులు సైతం
భయంతో గజగజ వణుకుతూ
మేఘాల్లో దాక్కున్నాయట
అది నిన్నటి ఓ పుక్కిట పురాణం
అసలు నిన్నేమి జరిగిందో
రేపేమి జరుగుతుందో
ఏ వింత వైరస్ వచ్చునో
విశ్వమంతా విస్తుపోయే
విలవిలలాడే గిలగిలలాడే
ఏ విపత్తు తెచ్చునో
ఎవరికెరుక ఆపరమాత్మకు తప్ప
అందుకే నేడు కళ్ళముందు
జరిగిందే ముమ్మాటికీ సత్యం
ఏదేమైనా ఇప్పుడు మనకు
కావలసింది
మంత్రాలు తంత్రాలు
మాయలు మహిమలుకాదు
స్థిరమైన అస్థిత్వమే
మచ్చలేని వ్యక్తిత్వమే
మంచితనం మానవత్వమే



