Facebook Twitter
దేవతలారా! దీవించండి!!

ఒమిక్రాన్ వేరియంట్‌ పేరు విన్నంత
విస్తుపోతోంది విశ్వమంతా
ప్రపంచమంతా ప్రసవవేదన పడుతోంది
ప్రజలు కార్చే కన్నీటిధారలకు
మహాసముద్రాలే ఉప్పొంగుతున్నాయి

మండే ప్రజలగుండెల్లో
అగ్నిపర్వతాలే బ్రద్దలౌతున్నాయి
క్షణక్షణం బ్రతుకు‌ భయం
కంటినిండా కునుకు లేదు
కడుపునిండా తిండి లేదు
కోట్లున్నా ఎందుకూ కొరగావు

ఏ క్షణాన ఈ ఒమిక్రాన్
ఏ వైపు నుండి ఏ రూపంలో
దాడిచేస్తుందోనని
గజగజ వణికిపోతున్న
నిస్సహాయులై ఏమిచేయలేక
ఏ దేవుళ్ళకు మొరపెట్టాలో
ఏ దేవతలకు మ్రొక్కాలో అర్థంకాక
ఆందోళనలో ఆవేదనతో అర్థంకాని
మానసికక్షోభతో కొట్టుమిట్టాడుతున్న

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతున్న
ఆసుపత్రుల్లోపిట్టల్లా రాలిపోతున్న
మృత్యువు కౌగిట్లోకి జారిపోతున్న

కన్నుమూసి కట్టెగా మారిపోతున్న
కడచూపు కరువై కన్నవారు దూరమై
ఏకాకులై కాటికి పారిపోతున్న
అనాధలై శ్మశానాల్లో కాలిపోతున్న
ఈ మానవాళిని రక్షించేవారేలేరా?

ఓ దేవుల్లారా ! ఎక్కడ మీరెక్కడ ?
కనిపించరేమి ? మీ భక్తులను కరుణించరేమి?
మళ్ళీ ఒమిక్రాన్ వేరియంట్
పేరుతో వస్తోన్న కరుణలేని
కరోనాను ఖతంచేసి కాటికి పంపరేమి ?
మీరే దిక్కని నమ్మిన మీ భక్తులను కాపాడరేమి?
అదిగో అన్ని ఆయుధాలు ధరించి
యుద్ధానికి సిద్ధమైన మీ భక్తుల్ని
ఓ  దేవుళ్ళారా! ఓ దేవతలారా ! ఆశీర్వదించండి!
ఒమిక్రాన్ భూతాన్ని ఓడించే శక్తిని ప్రసాదించండి!