ఎందరో
మహానుభావులు
అందరికీ వందనాలు..!
ఓ కవిమిత్రులారా..!
సాహితీ మూర్తులారా..!
సరస్వతీ పుత్రులారా..!
శ్రీ క్రోధి నామ సంవత్సర
ఉగాది పర్వదినాన
నేను మీకందించే నా
పంచాంగ శ్రవణమిదే...
అంతా ఆదాయమే తప్ప
వ్యయం లేని పంచాంగం
ఓ మిత్రులారా..!
సరస్వతీ పుత్రులారా..!
సాహితీమూర్తులారా..!
అంతులేని
ఆనందసాగరాన
ఎగిసి ఎగిసిపడే
మీ ఆలోచనల అలలు
అభివృద్ధి తీరం చేరును గాక..!
మీరు కన్న కమ్మని
కలలు ఫలించును గాక...
ఆ పంచభూతాలు
మీకు అక్షయపాత్రలగును గాక..!
ఉదయించే ప్రతిప్రొద్ధూ
మీ కోటికోర్కెలను తీర్చును గాక..!
ఆ ఏడుకొండల వెంకన్న మీకు
వెయ్యేనుగుల బలాన్నిచ్చునుగాక..!
కంచుకోటై మీకు రక్షణనిచ్చును గాక..!
లక్ష కోట్ల నక్షత్రకాంతిని మీ బ్రతుకుబాటలో విరజిమ్మునుగాక..!
మీ కష్టాలు కారుమబ్బుల్లా
కరిగిపోవును గాక...
మీ సమస్యలు ఎండుటాకుల్లా
ఎగిరిపోవును గాక...
మీ మదిలో శాంతిసుధలు..!
మీ ఇంటిలో సిరిసంపదలు...!
మీ కన్నీళ్ళతో కాంతిరేఖలు..!
మీ ముఖంలో చిరునవ్వులు..!
అలసిన
మీ గుండెలనిండా
అంతులేని ఆత్మతృప్తి...
ఊహల కందని ప్రశాంతత...
కుంభవర్షమై కురియునుగాక..!
జలపాతమై జలజల దూకును గాక..!
సెలయేరులై గలగల ప్రవహించును గాక..!
మీ జీవితం ఆనందనిలయమౌనుగాక..!
మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో
సుఖశాంతులతో విలసిల్లుదురు గాక..!
పిల్లాపాపలతో చల్లగా...
భోగభాగ్యాలతో హాయిగా...
నిండూనూరేళ్ళు వర్థిల్లుదురు గాక..!
నవ్వుల నది...కోటి వరాల నిధి...
ఈ క్రోధినామ సంవత్సర ఉగాది అంతా
మీ ముఖాలలో...
చిరునవ్వులు తాండవించునుగాక...
మీకు సకల శుభములు కలుగును గాక..!
అందరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు
(మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థచే 09.04.202
శ్రీ క్రోధినామ ఉగాది సందర్భంగా సహస్ర కవి భూషణ్
బిరుదు ప్రధానం చేసిన కవి సమ్మేళనంలోచదివిన కవిత)



