1...
ఉగాది అంటే...
శుభకార్యాలకొక
శుభముహూర్తమే...
ఉగాది అంటే...
ఓ పచ్చదనమే
ఓ ప్రకృతి చైతన్యమే
ఉగాది అంటే...
తెలుగు లోగిళ్ళకు
తొలి పర్వదినమే...
నక్రత్ర కాలగమనమే...
వసంతఋతువు ఆగమనమే...
ఉగాది అంటే...
ఊరించే
షడ్రుచుల పచ్చడే...
కొమ్మల్లో కోయిలమ్మల
కమ్మని రాగాలే...
మామిడాకులే...
మంగళ తోరణాలే...
పసందైన విందులే...
చిరునవ్వుల చిందులే...
ఇళ్ళంతా... సందడే...
ఊరంతా...ఉత్సాహమే...
మనసంతా... ఉల్లాసమే...
2...
ఉగాది అంటే...
తెలుగు భాషకు...
కమ్మని కవితలతో
కనకాభిషేకమే...
తెలుగు తల్లికి...
పసందైన పద్యాలతో
పట్టాభిషేకమే...
తెలుగు జాతికి...
జగతికి పండితుల
పంచాంగ శ్రవణాల
క్షీరాభిషేకమే...
ఉగాది అంటే...
కోటి కొత్త ఆశలకు
రెక్కలు తొడిగే
పండితుల ప్రవచనాలే...
అందరి
ముందరి జీవితాలు
సుందర నందనవనాలో...
కన్నీళ్ళో...కారుచీకట్లో...
అర్థంకాకున్నా బంగారు భవితపై
భారీ అంచనాలే...అంతులేని ఆశలే...
3...
ఉగాది అంటే...
సాహితీ సందడే...
కవి సమ్మేళనాలే...
కవుల కలాల పండుగే...
కవి కోకిలల కలయికలే...
ప్రేమపూర్వక పలకరింపులే...
కవుల కమ్మని కవితా గానాలే...
పసందైన పండితుల ప్రసంగాలే...
సాహితీ మూర్తులకు...
సన్మానాలే...సత్కారాలే...
అంబరాన్నంటే సంబరాలే...
ఉగాది అంటే...
మరపురాని
మరిచిపోలేని
మధుర జ్ఞాపకాలే...
సుందర స్వప్నాలే...
ఉగాది అంటే...
ఆశాకిరణమే...
ఆశలపందిరిని
అల్లుకోవడమే...
కమ్మనికలలు కనడమే...
భవిష్యత్తొక
అక్షయపాత్రన్న
కొండంత ఆశతో
ఆత్మస్థైర్యంతో
సవాళ్ళనెదుర్కోవడమే...
సమస్యలతో సతమతమౌతూ
సాహసంతో ముందుకు సాగడమే...
ముందున్నది
ముళ్ళబాటకాదు...
మరుమల్లెల తోటయని...
ఆశేశ్వాసగా సాగే ఒక అన్వేషణే...
ఉగాది అంటే...ఒక ఉషోదయమే...



