Facebook Twitter
నేను కవినై కలం పట్టానంటే..? …

నా అక్షరాలు రక్షణ కవచాలై...
ఆడపిల్లలను రక్షించాల్సిందే...

నేను కవినై కలం పట్టానంటే...
నేను కలం కత్తిని నూరానంటే...
కామాంధుల తలలు తెగిపడాల్సిందే...

నేను కవినై పట్టానంటే కలం ...
ఇక నా కలంలో ప్రవహించేది
సిరా కాదు...పవిత్ర గంగా జలం...

నేను కవినై కలం పట్టానంటే...
గాయత్రి మంత్రాన్ని జపించానంటే...
ప్రేమనదులు పొంగి ప్రవహించాల్సిందే...

నేను కవినై కలం పట్టానంటే...
నేను కలం కత్తిని ఝలిపించానంటే...

నా కవితలు...అగ్గిపుల్లలై...
అవినీతిపరులను దహించాల్సిందే...

నా కవితలు...కుక్కపిల్లలై...
నా చుట్టూ
కుయ్ కుయ్ మంటూ తిరగాల్సిందే...

నా కవితలు...సబ్బు బిళ్ళలై...
సమాజంలో కుళ్ళును కడగాల్సిందే...

నా కవితలతో...కులం విషవృక్షాన్ని
కూకటి వేళ్లతో సహా పెకలించాల్సిందే...

నా కవితలతో...రాక్షస రాజకీయాలను
గంగా నదిలా ప్రక్షాళన చేయాల్సిందే...

నా కవితలతో...మతోన్మాదులంతా ఇక
మానవత్వమే మతమని జపించాల్సిందే..