Facebook Twitter
ఆమెవరు...? కంటికి వెలుగు..! ఇంటికి దేవత..!!

మొన్న...
ఇష్టపడి ఇద్దరం అల్లిబిల్లిగా
కలల పందిరి అల్లుకున్నాం..!
అందమైన
చందమామతో ఆడుకున్నాం..!
మా చిలిపి చేష్టలకు
చిమ్మ చీకటిని బలి చేశాం..!

మొన్న...
రాత్రి ఆమె"ప్రేమగీతం" పాడితే
స్వర్గం నాకు స్వాగతం పలికింది
మొన్న పగలు
ఆమె"సుప్రభాతం" ఆలపిస్తే
సూర్యుడు నాకు చుట్టమయ్యాడు

నిన్న...
నా బ్రతుకు
చెట్టుకు పెనువేసుకున్న
మమతల లత ఆమె
నిన్న...
నా సంసార వీణపై
పలికిన శివరంజని రాగం ఆమె
ఆమొక త్యాగమయి..!
ఆమొక అనురాగమయి..!

ఆమె ఎప్పటికీ
నా ఊహల ఊర్వశినే
కాటుక కళ్ళతో
కలల పాఠాలు నేర్పిన
నా కలల రాణి ఆమె
నా పెదవుల మీద
ప్రేమ సంతకం చేసిన
నా ప్రియురాలు ఆమె
ఆమె నాకు ఒక తీపి జ్ఞాపకం
ఆమె నా ఊపిరి పరిమళం

నేడు...
మేము విలువల
మల్లెతోటలో వికసించిన పుష్పాలం..
దారి తప్పక దైవం చూపిన దారిలో పయనించే....ఆదర్శ దంపతులం...