కొందరంటారు
కాలం అతి ఖరీదైనదని...
కొనలేనిదని కోహినూర్ వజ్రమని...
కొందరంటారు
కాలమెంతో విలువైనది...
విలువకట్టలేనిదని...
విలువకట్టే మనిషి మహిలోలేడని...
కొందరంటారు కాలమెంత
విలువైందో తెలియాలంటే..?
విరహ వేదనతో విలవిలలాడే
నిదుర రాక నిరీక్షించే
క్షణమొక యుగంగా భావించే
భగ్న ప్రేమికుల నడగాలని..!
కొందరంటారు కాలమెంత
విలువైందో తెలియాలంటే..?
9 నెలలు గర్భంలో బిడ్డను మోసి
ప్రసవ వేదనతో పంటి బిగింపుతో
పసికందును కనే కన్నతల్లి నడగాలని..!
కొందరంటారు కాలమెంత
విలువైందో తెలియాలంటే..?
కఠోరమైన శిక్షణ పొంది ఆటల
పోటీలలో పరుగుపందెంలో పాల్గొని
కళ్ళల్లో కదలాడే కప్పును ముద్దాడాలని
ఒంట్లో ఊపిరినంత బిగబట్టి
పరుగులు తీసినా క్షణంలో కప్పు
మిస్ ఐపోయిన క్రీడాకారుల నడగాలని..!
కొందరంటారు కాలమెంత
విలువైందో తెలియాలంటే..?
ఏకాగ్రతతో కష్టపడి ఒకే లక్ష్యంతో
పుస్తకాల పురుగై రాత్రింబవళ్ళు చదివి
పరీక్షలు వ్రాసి ఒక్కమార్కుతో
విజయం చేజారిన విద్యార్థుల నడగాలని.!
కొందరంటారు కాలమెంత
విలువైందో తెలియాలంటే..?
రాత్రింబవళ్ళు సరిహద్దుల్లో
ఎముకలు కొరికే చలిలో
మంచుకొండల్లో పహారాకాస్తూ
చొర బాటుదారులతో తీవ్రవాదులతో
భారతమాత ముద్దుబిడ్డల రక్షణకోసం
నిత్యం మృత్యువుతో
పోరాడే ఆ వీరజవాన్ల నడగాలని...!



