Facebook Twitter
తెలియదు తెలియదు...?

ఓ మనిషీ రేపటిని
గురించి చితించకు
రేపేమి సంభవించునో
నీకు తెలియదంటోంది
పవిత్ర గ్రంథం బైబిల్..!

ఔనిది కాదనలేని నిజమే
ఏ నదికి తెలియదు...తానెంత
దూరం ప్రయాణించిందో...
ఎందరి దాహం తీర్చిందో...
ఎన్ని పంటపొలాల్లో ప్రవహించిందో...
తానెప్పుడు సముద్రంలో కలుస్తుందో...

ఏ చెట్టుకు తెలియదు...
తానెన్ని పళ్ళను
పశుపక్ష్యాదులకు అందించిందో...
తానెంతమంది
బాటసారులకు చల్లని నీడనిచ్చిందో...

ఏ మొక్కకు తెలియదు...
తాను ఏ రంగు పూలను పూసిందో...

ఏ చెట్టుకొమ్మకు తెలియదు...
తానే కాయలను కాసిందో...

ఏ కోయిలమ్మకు తెలియదు...
తానే పాటలు పాడిందో...

ఏ తల్లికి తెలియదు...రేపు
తానే బిడ్డకు జన్మనిస్తుందో...

ఏ వధూవరులకు తెలియదు...తాళి
కట్టేంతవరకు తమ భాగస్వాములెవరో...

ఈ సృష్టిలో ఏ జీవికి తెలియదు...
తానెందుకు ఈ నేలపై జన్మించిందో...
తన జన్మకు అర్థం పరమార్థమేమిటో...
తానెప్పుడు పరమాత్మలో లీనమౌతుందో..

ఔను ప్రతిమనిషి విధిచేతిలో కీలుబొమ్మే
ఎంతకూ అర్థం కానిది ఈ మానవ జన్మే..!