Facebook Twitter
సెల్ ఫోన్ చెర నుండి..?

మన చేతిలోని సెల్
అణుబాంబా..?
అమృత భాండమా..?

నీ నా నాశనం
కోరే బద్ధశత్రువా..?
మన మంచిని కోరే
శ్రేయోభిలాషినా..?

పెరట్లో పూజించే
తులసి మొక్కనా..?
కాలుపడితే జారిపడే
అరటి తొక్కనా..?

బంధాలు
అనుబంధాలు
రక్త సంబంధాలు
పెరుగుతున్నాయా...?
మెరుగౌతున్నాయా..?
కనుమరుగౌతున్నాయా..?

సమాజంలో మన
మానవసంబంధాలు
కరిగి పోతున్నాయా...?
తరిగి పోతున్నాయా..?
విరిగి ముక్కలౌతున్నాయా..?

మనలోని
ఆత్మరాముడు
ఆనందంతో
తాండవమాడున్నాడా..?
విషాదంతో విలపిస్తున్నాడా..?

ఇదొక బంధిఖానానా..?
ఇదొక పెళ్లి సంబరమా..?
స్మశానానికి ప్రయాణమా..?
ఇదొక విషాదమా..? వినోదమా..?

ఈ సెల్ శక్తేమిటో...
దీని ప్రభావమెంతో...
ఏం జరుగుతుందో లోపల
రేపేం జరుగుతుందో బయట

అర్థం కావడం లేదు
అంతుచిక్కడం లేదు
ఈ సెల్ చెర నుండి
శాశ్వత విముక్తి ఎప్పుడో...?

కళ్ళు ఇల్లు ఒళ్ళు
గుల్లయ్యాకనా..?
మానవ సంబంధాలు
బలయ్యాకనా..? ఎప్పుడు..?

స్వీయ నియంత్రణకు
కట్టుబడి ఉంటామని
కళ్ళు తెరిచి మనం
నిప్పులాంటి ఒక గట్టి
నిర్ణయం తీసుకున్నప్పుడు..!
అప్పుడే సెల్ ఫోన్ చెరనుండి విముక్తి..!