నిన్న...
సాన బట్టని కత్తిని నేను
సాగు చేయని భూమిని నేను
గుళ్ళో కొట్టని గంటను నేను
మెళ్ళో కట్టని తాళిని నేను..!
నిన్న...
కోవెల్లో కొలువైవున్న
శివున్ని చేరని కుసుమం నేను
ఇంట్లో వెలిగించని దీపం నేను
ఎవరూ తెరవని పుస్తకం నేను
ఎవరూ వ్రాయని కావ్యం నేను
ఎవరూ చదవని బృహత్ గ్రంథం నేను..!
నిన్న...
ఫలించక పుష్పించక
మోడువారిన చెట్టును నేను
గలగలపారని సెలయేరును నేను
క్రిందికి దూకని జలపాతాన్ని నేను
సముద్రంలో కలవని నదిని నేను..!
నిన్న...
మ్రోగని వీణను నేను
కూయని కోయిల నేను
కరగని మంచును నేను
కురవని నల్లని మేఘం నేను
నాట్యం చేయని నెమలిని నేను..!
నేడు...
తీరం చేరిన "అలను" నేను
దైవం చెక్కిన "శిలను" నేను
కంటిలో కరగని కమ్మని "కలను" నేను..!
నేడు...
ఆరని కరగని కొవ్వొత్తిని నేను
దివిలో వెలిగే ధృవతారను నేను
ఎడారిలో
ప్రవహించే ఒయాసిస్సును నేను.!
కారణం...నాకు జ్ఞానోదయమైంది..!
ఆ దైవం నాకు పునర్జన్మనిచ్చింది...!



