Facebook Twitter
చదువుకోండి..!పిల్లలూ శ్రద్ధగా చదువుకోండి..!!

చదువుల తల్లి
సరస్వతీ దేవిని
నిత్యం ప్రార్థిస్తూ...
ఆమె పాదపద్మాలకు
నమస్కరిస్తూ...

కష్టపడి...‍ఇష్టపడి
ఏకాగ్రతతో శ్రద్ధగా
చదువుకోండి..!
పిల్లలూ చదువుకోండి..!!

"కష్టపడి చదివితే
"కలెక్టర్లు ఔతారు
"ఇష్టపడి చదివితే
"ఇంజనీర్లు ఔతారు"

కూలీ చేసి కూడబెట్టి
తలకు మించి అప్పుల్జేసి
కమ్మని కలలెన్నో కంటూ
కష్టపడి మీ స్కూల్
కాలేజీ ఫీజులు కట్టే
మీ అమ్మానాన్నల కన్నీటి
గాధల్ని మననం చేసుకుంటూ..

విద్య లేనివారంతా
వింత పశువులేనని...
కృషివుంటే మనుషులు
ఋషులైతారని...
మహాపురుషులౌతారని...
విద్య విలువ నెరిగినవారే
విజేతలౌతారని...
విశ్వగురువలౌతారని...
బోధించిన సంఘసంస్కర్త
మహాత్మ జ్యోతిరావు ఫూలేను

సంఘములో సమానత్వం
విద్య ద్వారానే సాధ్యమని...
ప్రబోధించిన జ్ఞానసూర్యుడు
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను
క్షణక్షణం గుర్తుచేసుకుంటూ...
చదువుకోండి..!పిల్లలూ
శ్రద్ధగా చదువుకోండి..!!

మురికివాడల్లో...
గుడిశల్లో గుడ్డిదీపాల క్రింద
కూరగాయలమ్ముకుంటూ..
రోడ్ల ప్రక్కన బజారుల్లో...
బస్టాండుల్లో...రైల్వే స్టేషన్లోలో...
చలికి గజగజ వణుకుతూ...
చెత్తకుండీల్లో చెత్త ఏరుకుంటూ
వీధిలైట్ల మసకవెలుతుర్లో...
చదవుకోండి..! పిల్లలూ
శ్రద్ధగా చదువుకోండి..!!

కష్టేఫలి...యని
శ్రమయేవ...జయతేయని
చదువంటే దీపమని..
ప్రగతికి ప్రతిరూపమని...
చదువంటే దైవమని...
చదువే సర్వస్వమని...
తెలుసుకోండి..!
పిల్లలూ తెలుసుకోండి..!!
తెలుసుకుంటే...
మీ బ్రతుకుల్లో తేనె నిండునోయ్..!
చదువుకుంటే...
మీ బ్రతుకులు చల్లగుండునోయ్..!