ఓ మిత్రమా! నా ప్రియ నేస్తమా !
సర్వరుచుల సమ్మేళనంతో
మమతల మసాలాలు వేసి
వలపుల వంటలు చేసి
ప్రక్కనే కూర్చొని ప్రేమతో
చక్కగా కొసరి కొసరి వడ్డించే...
మీ శ్రీమతి మీకొక బంగారు బహుమతి..!
చీదరించుకోక...
చిరుబురులాడక...
"అతిధి దేవుళ్ళను" ఆదరించే...
వినయ విధేయతలతో
"అత్తమామలను" గౌరవించే...
మీ శ్రీమతి మీకొక బంగారు బహుమతి..!
సమస్యల సర్పాలెన్ని
బుసలు కొడుతున్నా
కృంగి పోక కుమిలి పోక
సహనంతో సర్దుకుపోయే...
సమయస్ఫూర్తితో
చక్కని సలహాలనిచ్చే...
కష్టాలలో కన్నీరు కార్చక...
చిక్కుల్లో చీకాకు పడక...
చిరునవ్వులు చిలకరించే...
చిలిపిగా కవ్వించే...
మనసారా నవ్వించే...
మీ శ్రీమతి మీకొక బంగారు బహుమతి..!
పతినే"ప్రత్యక్ష దైవంగా"భావించే...
భక్తితో అనురక్తితో ఆరాధించే...
అనుదినం "భర్తను" తనివితీర
"అనురాగా మృతంతో "అభిషేకించే
పగలు రేయి పరవశింపజేసే...
స్వర్గసీమలో విహరింపజేసే...
ఇంటిని భూతలస్వర్గంగా మార్చేసే...
మీ శ్రీమతి మీకొక బంగారు బహుమతి..!
అట్టి ఆ అనురాగ దేవత
మీ సంసార నౌకకు
ఒక చక్కని చుక్కానియే..!
మీరిద్దరిలలో
దివ్య స్వరూపాలైన
ఆ సీతారాములకు...ప్రతిబింబాలే
ఆది దంపతులైన ఆ పార్వతీ
పరమేశ్వరులకు ప్రతిరూపాలే..!
మీరిద్దరు ఆ దైవం
దీవించిన ఆదర్శదంపతులే....!



