Facebook Twitter
నీ అనుకూల శత్రువులెక్కడ...?

నీ వెంత? నీ బ్రతుకెంత?
నీవు నా కాలి గోటికి
కూడా సరిపోవంటూ
తొడగొట్టేవాళ్ళు...
నిన్ను ఎదగనీయకుండా
పడగొట్టేవాళ్ళు...
కడుపులో కక్ష పెట్టుకొని కౌగిలించుకునేవాళ్ళు...
అడుగడుగునా
అడ్డుకునేవాళ్ళు...
నీ అభివృద్ధిని
అనకొండలా మింగేసేవాళ్ళు...

నీ సంతోషాన్ని చూసి
తట్టుకోలేనివాళ్ళు...
దాన్ని దుఃఖంగా
మార్చాలనుకునేవాళ్ళు..
అక్కసును వెళ్ళగ్రక్కేవాళ్ళు...
కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాళ్ళు...
కడుపు మంటతో రగిలిపోయేవాళ్ళు...

నిన్ను తిట్టే వాళ్ళు...నిన్ను
లోతైన గోతికిలోనికి నెట్టేవాళ్ళు...
నిన్ను పైమెట్టుకు చేరనివ్వకుండా
కాళ్లెట్టుకు వెనక్కి లాగేవాళ్ళు...
కాలసర్పాలై చాటుమాటుగా
కాటేసేవాళ్ళు...నీ చుట్టే ఉంటారు
కొందరు నీ కళ్ళకు కనిపిస్తారు...
కొందరు అపరిచితులు...అదృశ్యశక్తులు

అందుకే
ఓ మిత్రమా
ఇకనైనా మేల్కొనాలి
డేగ కళ్ళతో నిఘా పెట్టాలి
అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి

ఎవరో విసిరిన వలలో చిక్కుకోరాదు ఎవరెంతగా విమర్శల విషం
చిమ్మినా విలపించరాదు
శాడిస్ట్ లకు తగిన బుద్ధి చెప్పాలి
గుర్తుండే గుణపాఠం నేర్పాలి

నీవు నిత్యం వారి కళ్లకు
"మృత్యువులా" కనిపించాలి
వారికి "కనువిప్పు" కలిగించాలి
వారెంతకూ "దారికి" రాకుంటే
"దైవానికి"...వదిలేయాలి...