Facebook Twitter
ఆరడుగుల జాగా కోసం..?

పండని...
పండినా ఫలితాన్ని
అనుభవించలేని...

ద్రాక్ష తోటలు...
మామిడి తోటలు...
బంగారు గనులు...
వేలఎకరాల భూములు...

కట్టుకోని...పట్టుచీరలు...
పెట్టుకోని...ఖరీదైన
బంగారు వెండి ఆభరణాలు...
వాడని...కార్లు...పాదరక్షలు...
తొడగని...
ఖరీదైన కోట్లు సూట్లు బూట్లు...

శయనించలేని...
విలాసవంతమైన విల్లాలు
అబ్బురపరిచే అందమైన
అతి ఖరీదైన విదేశీ పర్నీచర్ తో
మిళమిళ మెరిసే ఏసీ గదులు...
నిగనిగలాడే పాలరాతి భవనాలు...
బినామీ ఆస్తులు నేడెన్ని ఉన్ననేమి..?

రేపు ఈ మనిషి
శాశ్వతంగా నిద్రించేది...
ఆరడుగుల జాగాలోనే...
కాలేది చితిమంటల్లోనే...
మారేది పిడికెడు భస్మంగానే...