రహస్యమొక్కటే రక్త సంబంధం..!
ఎప్పుడైనా ఏదైనా
పట్టరాని కోపంతో
ఆపుకోలేని ఆవేశంతో
నరంలేని నాలుకేదో
పురుష పదజాలంతో
పరులపై విరుచుకుపడితే...
చెళ్ళుమనేవి...చెంపలు
గిర్రున తిరిగేది...కళ్ళు
రాలేది...పదహారు పళ్ళు
పడేది...వీపుమీద వాతలు
వొణకేది...కాళ్ళు చేతులు
విరిగేది...ఒంట్లో ఎముకలు
కారేది...కంట్లో కన్నీరు
కానీ కదిలే గుండెకు
కనిపించని మనసుకు
ఏదైనా చిన్న గాయమైనా
విలపించేది...కళ్ళురెండు
ఎర్రగా కందిపోయేది...ముఖం
ఆ కన్నీటి ధారల్ని తుడిచేది...
ఆ చల్లని చేతులు
చూశారా మిత్రులారా..!
ఒక చిన్న నాలుక
చేసిన ఒక చిన్న తప్పుకు
శరీరంలోని ఎన్ని అవయవాలు
ఎంతో నరకాన్ని అనుభవించాయో...
అది కదా అవయవాల అనుబంధం.!
ఔను తీర్చలేని అప్పులు
ఘోరమైన తప్పులు
చేసేది...ఇంటి పెద్ద ఆపై
కురిసేది...కష్టాల నిప్పులవాన
కుటుంబ సభ్యులపైన...ఇక్కడ
రహస్యం ఒక్కటే రక్త సంబంధం..!



