Facebook Twitter
కష్టం..! సుఖానికి చుట్టం..!!

ఓ కష్టమా..! కాలసర్పమా..!
నన్నే ఏల వెతికి
వెతికి పట్టుకొంటివి..?
నిన్నే ఏల సునామిలా
అనకొండలా చుట్టుకొంటివి..?
ఈ ధరణిలో ఎందరో నీ
కళ్ళముందే తిరుగాడుతున్నా
నా చెంతనే ఎందుకు చేరితివి..?

ఓ కష్టమా..! కాలసర్పమా..!
నన్నే ఏల చాటు
మాటుగా కాటు వేస్తివి..?
నన్నే ఏల ఊబిలో తోస్తివి...
నన్నే ఏల పువ్వులా నలిపి వేస్తివి..?
నన్నే ఏల చీకటిలో కలిపి వేస్తివి....?
నాపైనే ఎందుకు విషం చిమ్మితివి..?
మాయచేస్తివి...బాధకు బలిచేస్తివి..?

ఓ మాయదారి మనిషీ..!
ఓ అమాయకపు మనిషీ..!
నేను సుఖానికి చుట్టాన్ని...
నేనేది చేసినా అది నీ మంచికే
నీలో ఒక పశ్చాత్తాపం కోసమే...!

నిన్ను శుద్ధిచేసి మండే
"సూర్యునిగా" మార్చడం కోసమే..!
నిన్నొక "చల్లనిచంద్రుడిగా"...
ఒక "కరుణామయుడిగా"...
కల్మషంలేని
ఒక "మానవతావాదిగా"
తీర్చిదిద్దడం కోసమే..!

నన్ను దాటగానే ఇక నీ ప్రయాణం
అంతులేని ఆనంద సాగరంలోకే..!
సుఖాల సుందర నందనవనంలోకే..!

కారణం గాయపడినందుకే కదా
"శిధిలమై పోయిన ఒక శిల"
"సుందర శిల్పంగా" మారేది..!
కానీ ఆ గాయాలు చేసిన సుత్తి
సుత్తిగానే మిగిలిపోతుంది కదా

గుర్తుంచుకో ఈ జీవితసత్యం..!
చింతలు తరిగితే...
చిరునవ్వులేనని..!
చీకటి తెరలు తొలిగితే...
వెన్నెల వెలుగులేనని..!

మరువకు ఈ నిండు నిజం...!
జీవితం...
ఒక నవ్వుల పువ్వుల నావేనని..!
జీవితం...
ఒక సుఖసంతోషాల స్వర్గసీమేనని..!