Facebook Twitter
ఇది కదా...పరోపకారమంటే..?

"తన కలంలోని
"ఇంకును"
"ఇంధనంగా" మార్చి
"ఇతరుల జీవితాల్ని
"వెన్నెలమయం" చేసే
...ప్రతి కవి...ఓ పరోపకారియే...

తాను కుంభవర్షంలో స్నానమాడి
పరులను రోగాలనుండి రక్షించే
...ప్రతి గొడుగు...ఓ  పరోపకారియే...

తాను మండుటెండలో
మాడిపోతూ ఇతరులకు
చల్లని నీడనిచ్చే...
కమ్మని ఫలాలనిచ్చే...
...ప్రతి చెట్టు...ఓ పరోపకారియే...

తమ రక్తాన్ని...ప్రేమను
ఆర్జించిన ఆస్తినంతా...
పిల్లలకు పంచి తాము
ఏమిలేని అనాధలయ్యే...
అనాధాశ్రమాలకు అతిథులయ్యే...
...ప్రతి అమ్మానాన్న ఓ ప్రత్యక్ష దైవమే...

ప్రయాణికులంతా ఒళ్ళు మరచి గాఢనిద్రలో గురకలు పెట్టేవేళ
కంటికి కునుకు లేకుండా
మేల్కొని రాత్రంతా డ్రైవ్ చేసి బస్సును
అత్యంత సురక్షితంగా గమ్యం చేర్చే
...ప్రతి బస్ డ్రైవర్ ఓ ప్రాణదాతే...

ఔను
ఇది కదా...
పరోపకారమంటే..?
ఔను వీరు కదా...
పరమాత్మ స్వరూపులంటే..?
మనిషన్నవాడు...
మానవత్వమున్న ప్రతివాడు
"అహంకారానికి స్వస్తి" పలకాలి...
"పరోపకారమే ఆస్తిగా" భావించాలి...
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి...
స్పందించాలి సహాయం అందించాలి...
అప్పుడే మన  బ్రతుకు సార్థకం...
ఈ మానవజన్మకు ఒక అర్థం పరమార్థం..!