Facebook Twitter
ప్రకృతి పగబడితే..?

వరదంటే..? బురద
బురదంటే ఎవరికి సరదా..?
వరదంటే వరదకాదు అది కన్నీటి వరద...
నీళ్ళింకిన కళ్ళలో రాలేది రక్తాశ్రువులే...

కురిసే...కురిసే కుంభవర్షం...కురిసే...
విజయవాడ విలవిలలాడిపోయే...
మున్నేరు వాగు ముంచెత్తే...
బుడమేరు ఉగ్రరూపం దాల్చే...
విలయ తాండవం చేసే... జలప్రళయంలో...జలదిగ్బంధంలో...
జనజీవనం స్తంభించిపోయే...
అంధకారంలో చిక్కి అల్లాడిపోయె...

బ్రతుకు చెరువాయే...
ఆదుకునేవారు కరువాయే...
ఆకేరు వాగులో యువ
శాస్త్రవేత్త అశ్విని అసువులు బాసే...

కళ్ళముందే కన్నవారు
గొడ్డూ గోదా కొట్టుకుపోయే...
పచ్చని పంటలు నీటమునిగిపోయే...
పల్లెల్లో గుడిసెలు కూలిపోయే...
నగరాల్లో బ్రతుకు నరకమాయే...

అయ్యో..! వరుణ దేవా..!
ఎందుకు మాపై నీ కింత కక్ష..?
ఏమిటి మాకు అగ్నిపరీక్ష..?
మేం చేసిన తప్పేమిటి..?
ఆకస్మికమైన ముప్పేమిటి..?

ఎటుచూసినా నీరే నీరే కన్నీరే...!
కాపాడి రక్షించే వారే కానరారే...!
పగబట్టింది పరుగులు తీస్తుంది
ఉగ్రరూపం దాల్చింది....కృష్ణమ్మ
కరుణించి కాపాడలిక...కనక దుర్గమ్మ

తల్లీ నేడే మాకు జ్ఞానోదయమైంది..!
నాలాలు ఆక్రమించడం...
చెరువుల్ని కబ్జా చేయడం...
సుందరీకరణ పేర చెట్లను నరికేయడం...
పర్యావరణ పరిరక్షణ మరచి
భూతాపాన్ని పెంచడం...మా నేరమని...
ప్రకృతిపగబడితే నరుని బ్రతుకునరకమని