1...
అయ్యో..!
అయ్యో..! ఓ దైవమా..!
ఎంత కష్టం..? ఎంత కష్టం..?
ఎంతనరకం..? బ్రతుకెంతనరకం..?
ఓ అన్నలారా..! ఓ అక్కలారా..!
రెండు చేతులెత్తి మొక్కుతున్నం..!
ఆదుకోండి..! ఆదుకోండి..! మమ్ము
"జలదిగ్భంధంలో " చిక్కుకుంటిమి..!
కళ్ళముందే ఇళ్ళన్నీ కూలిపోయె
కన్నోళ్ళు వరదనీట కొట్టుకుపోయె
పరుపులు పోయె...సరుకులు పోయె
వస్తువులు పోయె..గొడ్డు గోదా పోయె
కట్టుబట్టలతో రోడ్లమీద మిగిలిపోతిమి...
ఆకలేసి దాహమేసి
ఆపన్న హస్తాల కోసం...
పాలప్యాకెట్లకోసం ఎదురు చూస్తూ
నడుములోతు నీళ్ళలో మునిగి
కారు చీకట్లో...కన్నీటి వరదలో
ఈదుకుంటూ బ్రతుకుతుంటిమి...
ఓ అన్నలారా..! ఓ అక్కలారా..!
రెండు చేతులెత్తి మొక్కుతున్నం..!
ఆదుకోండి..! ఆదుకోండి..! మమ్ము
"జలప్రళయంలో " చిక్కుకుంటిమి!
2...
కోట్లు కోట్లు విరాళాలిస్తిరి....!
అధికారులకు ఆదుకొమ్మని..!
మధ్యలోనే మాయమాయె..!
మాకు మాత్రం చేరకపోయె..!
అయ్యో..! అయ్యో..! ఓ దైవమా
ఎంత ఘోరం..? ఎంత దారుణం..?
ఎటు చూసినా ధ్వంసమైన ఇళ్ళే...
ఏ మనిషిని కదిలించినా కన్నీళ్ళే...
ఉప్పొంగిపోయింది...
ఉగ్రరూపం దాల్చింది...
ఉరుకు పరుగులతో వచ్చింది...
కసితో కృష్ణమ్మ...కరుణించి...కాపాడి...
రక్షించాలిక...కన్నతల్లి...కనకదుర్గమ్మ...
పంచభక్ష్య పరమాన్నాలు మాకక్కర్లేదు
చాలును మా పిల్లలకు ఓ పాలపాకెట్
ఓ పులిహోర పాకెట్ ఓ వాటర్ బాటిల్...
రేపటికి మేం ప్రాణాలతో బ్రతికేందుకు...
ఓ అన్నలారా..! ఓ అక్కలారా..!
రెండు చేతులెత్తి మొక్కుతున్నం..!
ఆదుకోండి..! ఆదుకోండి..! మేమంతా "జలసమాధి" ఐపోక ముందే..!



