Facebook Twitter
అడుగడుగు నీ అంతరంగాన్నడుగు..?

అడుగడుగు అమ్మనడుగు
నాకీ జన్మనెందుకిచ్చావని...
అడుగడుగు నాన్ననడుగు
నన్నెందుకు చదివించావని...
అడుగడుగు నీ గురుదేవులనడుగు..
నాకెందుకీ జ్ఞానాన్ని బోధించారని...
అడుగడుగు నీ దేశాన్నడుగు
ఓ దేశమా నీవు నాకేమిచ్చావని...

అడుగడుగు నీ అత్తామాలనడుగు
ఇంత అందమైన
కూతురునెందుకు కన్నారని...
అడుగడుగు చిచ్చర
పిడుగులైన నీ పిల్లల్నడుగు
నా కడుపునే ఎందుకు పుట్టారని...
అడుగు అడుగు నీ అర్దాంగినడుగు
ఏరికోరి నన్నే ఎందుకు మనువాడావని...

అడుగడుగు ఆ పంచభూతాలనడుగు
సకల జీవరాశులకకెందుకు
అన్నింటినీ ఉచితంగా అందిస్తున్నారని...
అడుగడుగు ఆ బ్రహ్మ దేవుణ్ణడుగు
నాబొందిలోఎందుకు ఊపిరి పోశావని...

అడుగడుగు నీ అంతరంగాన్నడుగు
నీకింతకాలం ఇంతగా
కొండంతగా అండగా ఉన్న
నీ అమ్మనాన్నలను...నీ గురుదేవులను..
ఎన్నడైనా ఎప్పుడైనా ఒక్కసారైనా
ఎత్తుకున్నావా...?
ఎదకు హత్తుకున్నావా...?
భుజాలమీద మోశావా..?

నిన్ను ఆశీర్వదించిన
ఆ భగవంతున్ని
నీకెన్నో వరాలను పంచిన
ఆ పంచభూతాలను
ఎన్నడైనా ఎప్పుడైనా ఒక్కసారైనా
మదిలో స్మరించావా..?
గదిలో పూజించావా..?
ఆ ప్రతిమల ముందర పడి
సాష్టాంగ నమస్కారం చేశావా..?
కాసింతైనా కృతజ్ఞత చూపావా..?
ఓ మనిషీ గుర్తుచేసుకో ఒక్కసారి...!