Facebook Twitter
నీవు నిజంగా మనిషివైతే..?

  తప్పించుకోవచ్చు...
నీవు దొంగవైతే...పోలీసుల
లాఠీదెబ్బల నుండి...
ఖైదీవైతే...జైలు నుండి...
నేరస్థుడివైతే...
కోర్టు కేసుల నుండి...
యావజ్జీవ కారాగార శిక్ష నుండి...

మొద్దు విద్యార్థివైతే...
గురువు కొట్టేదెబ్బల నుండి...
ఉద్యోగివైతే...
ఆఫీస్ బాధ్యతలనుండి...
బాస్ వేధింపుల నుండి...
సేవకుడివైతే...బాధించే
భయపెట్టే యజమాని నుండి...

తండ్రివైతే...నీ త్రాగుబోతు
కొడుకు బెదిరింపుల నుండి...
నీవు త్రాగుబోతు భర్తవైతే...
సైలెంట్ గా సాధించే చిత్రహింసలకు గురిచేసే నీ గయ్యాళి భార్య నుండి...

కానీ నిజంగా నీవు మనిషివే ఐతే
తప్పించుకోలేవు నీ మనస్సాక్షి నుండి...
భౌతికంగా భగవంతుడు నీకు
విధించవచ్చు "మరణశిక్ష" ఒకేసారి...

కానీ నీవు చేసిన
అతి క్రూరమైన...
అతి దారుణమైన...
అతి భయంకరమైన...
నేరాలు...ఘోరాలు...నీచకృత్యాలు
నీ మనస్సాక్షికి తెలుసు అందుకే
నీ మనస్సాక్షి నీకు మౌనంగా విధిస్తుంది
"మరణశిక్ష "...ప్రతిదినం...ప్రతిక్షణం...

అనుభవించక తప్పదు
నీ కళ్ళకు కనిపించని...
నీ చెవులకు వినిపించని...
ఆ అంతులేని బాధను...
ఆ వ్యధను...ఆవేదనను...
ఆ ఆక్రందనను...భరించలేని...
ఆ మానసికక్షోభను...ఆ నరకాగ్నిని...