Facebook Twitter
ఆవేశం ఆవగింజంత..! శాంతం సముద్రమంత..!!

కుట్టకు తేలులా..!
కరవకు పాములా..!
అరవకు శునకంలా..!

వద్దు మిత్రమా వద్దు..!
పాలుపోసి పెంచకు..!
పగా ప్రతీకారాలను...
అసూయా ద్వేషాలను...
విభేదాలను విరోధాలను...
అవి చాటు మాటుగా
కాటు వేసే విషసర్పాలు..!

వద్దు మిత్రమా వద్దు..!
అపార్థాలతో...
అనుమానాలతో...
చెప్పుడు మాటలతో...
తప్పుడు తలంపులతో...
సత్సంబంధాలను
సమాధిచేసుకోకు..!

వద్దు మిత్రమా వద్దు..!
సూదుల్లాంటి సూటి
పోటి ఘాటైన మాటలు
నీ నోటివెంట రానివ్వకు..!
నీ శత్రువులను శపించకు..!
దూషించకు...నిందించకు..!
పిచ్చి కోపంతో రెచ్చపోకు..!
నిప్పులు చెరగకు..!
చెప్పులు విసరకు..!

వద్దు మిత్రమా వద్దు..!
జంతు భావనలు నీ
తలంపుల్లోకి రానియ్యకు..!
నిన్ను నీవు పులితో సింహంతో
గజరాజుతో పోల్చుకోకు..!
నీ శత్రువుల్ని గాడిదలని...
బురదలో పందులని...
గుంటనక్కలని...గజ్జికుక్కలని...
పందికొక్కులని దూషించకు..!

తెలుసుకో మిత్రమా తెలుసుకో..!
ఒక నిండు నిజాన్ని..!
ప్రతి తల్లి తొమ్మిది నెలల
తర్వాతనే బిడ్డకు జన్మనిస్తుందని..!
మండే ప్రతి గుండెగాయానికి
కాలమే ఒక మంచి మందని..!
భక్తితో భగవంతున్ని సేవించే
ప్రతి వ్యక్తికి ముక్తి దొరుకుతుందని..!
ప్రతి చిక్కు సమస్యకు
ఒక చక్కని పరిష్కారముందని..!
మనిషిలో ఆవేశం...ఆవగింజంత..!
శాంతం...సముద్రమంత ఉండాలని..!