ఓ మనిషీ...!
అస్తమించే సూర్యునికి
మ్రొక్కి లాభమేమి..?
ఆపై కమ్మేది కారుచీకట్లే..!
ఉదయించే సూర్యునికి
మ్రొక్కిన నీ బ్రతుకున
విరిసేది కాంతి రేఖలే...!
కురిసేది శాంతి సుధలే..!
కరుణ జాలి దయలేక
కసాయిలా కడుపు మాడ్చే
పిశాచి లాంటి పినతల్లికి
మ్రొక్కి లాభమేమి..?
ప్రేమ పుట్టేనా
ఆ పాషాణ హృదయాన..!
నీ కష్టాలను తొలిగించే
నీ కన్నీళ్ళను తుడిచే
నీ ఆకలి ఆశలు తీర్చే
నీ కన్నతల్లికి మ్రొక్కిన
దక్కును కదా నీకు
కోటిజన్మల పుణ్యఫలం..!
ఓ మనిషీ..! ఎన్నికల వేళ
వాగ్దానాల వర్షం కురిపించి...
మాయమాటలతో మత్తెక్కించి...
ఓట్లకోసం వాడుకొని వదిలేసే...
ఏరుదాటాక తెప్పను తగలేసే...
నిత్యం నోట్లకట్టలపై శయనించే
నాయకులకు ఓట్లేసి లాభమేమి.?
నీ ఓటు నీకు వెన్నుపోటే కదా...!
నేనునున్నా నంటూ
ప్రతి సమస్యను పరిష్కరించే...నీ
కష్టాలలో కొండంత అండగా ఉండే... ఆపదంటే ఆదుకునే నిస్వార్థపరులైన నేతలకు
ఓట్లేసిన...రేపు నీ
బ్రతుకు పరిమళించే పూలతోటే కదా..!
ఓ మనిషీ..!
నయంకాని మొండి జబ్బులతో
కుమిలిపోయే వేళ...బ్రతుకు
మీద ఆశలు ఆవిరైపోయే వేళ...
నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే
ప్రాణదాతల పాదాలకు మ్రొక్కిన
అది నీ కృతజ్ఞత...నీ సంస్కారమే కదా..!
నీ మూఢ భక్తి భయం బలహీనతలే
మూలధనంగా విలాసవంతంగా బ్రతికే
బాబాలు భగవత్ స్వరూపాలని
పాదాలకు క్షీరాభిషేకం చేయుట
ఎంతటి అజ్ఞానం..?
ఎంతటి మూర్ఖత్వం..?
ఎంతటి అమాయకత్వమో కదా..?
అందుకే ఓ మనిషీ..!
ఒక్కసారి విశాలమైన
విశ్వాన్ని తిలకించు...
అగాధ జలనిధిలో
ఆణిముత్యాలున్నట్టే...
నీ అంతరంగాన దాగిన
నిధి నిక్షేపాలను అన్వేషించు...
ఆత్మను ఆరాధించు...సత్యాన్ని శోధించు
విచక్షణతో వివేకంతో విజ్ఞతను ప్రదర్శించు
హాయిగా హంసలా జీవించు...ఆపై ఆ
పరమాత్మ నీకు ప్రశాంతతను ప్రసాదించు



