ఓ అమ్మా నాన్నలారా..!
మోడువారిన
మా జీవితక్షేత్రాల్లోకి
సైలెంట్ గా పారి మా
బ్రతుకులను సస్యశ్యామలం
చేసిన..."నీరు కదా మీరు"..!
ధన్యజీవులం కదా...మేము..!
ఓ అమ్మా నాన్నలారా..!
మా ఆర్థిక బాధలు భరించి
మాచే వీదేశీయానం చేయించి
ఉన్నత చదువులు చదివించి
ఉత్కృష్టమైన స్థితిని అందించి
ఖండాంతర ఖ్యాతి నార్జించేలా
నేడు ప్రపంచమే కీర్తించేలా
మా వ్యక్తిత్వాలను తీర్చిదిద్దిన
పుణ్యమూర్తులు కదా...మీరు..!
ధన్యజీవులం కదా...మేము....!
ఓ అమ్మా నాన్నలారా..!
నిన్న నిద్రాహారాలు మాని
నిరంతరం శ్రమించి...మా
జీవితాలను వినోద సహితంగా
విలాస భరితంగా మార్చిన
"దైవస్వరూపులు కదా" మీరు..!
"ధన్య జీవులం కదా" మేము..!
ఓ అమ్మా నాన్నలారా..!
నిన్న రేయింబవళ్ళు
రెక్కలు ముక్కలు చేసి
నేడు రెక్కలు విరిగిన పక్షులైనా...
బహుదూరపు బాటసారులైనా....
అనాధలైనా...ఆకలికి
అలమటించే అస్తిపంజరాలైనా...
మా కోసం మీ ప్రాణాలను
త్యాగం చేసిన త్యాగమూర్తులు
చిరంజీవులు చిరస్మరణీయులు
"ప్రత్యక్ష దైవాలు కదా" మీరు...
ధన్యజీవులం కదా...మేము.....
అందుకే ఓ అమ్మా నాన్నలారా..!
నేడు శిరసు వంచి
రెండు చేతులు జోడించి
మీ పాదపద్మాలకు ప్రణమిల్లి
చేస్తున్నాం సాష్టాంగ నమస్కారం..
మిమ్మల్ని ఆరాధించే
అర్హత మాకున్నదోలేదో..?
ఓ అమ్మానాన్నలారా..!
మమ్మల్ని క్షమించండి
మరో జన్మంటూ ఉంటే
మళ్ళీ మీ గర్భాన జన్మించి
తప్పక మీ ఋణం తీర్చుకుంటాం..!



