Facebook Twitter
నీ కవిత్వం నవవసంతమా? నవయవ్వనమా?

వాక్యం ప్రక్కనే వాక్యం 

పేర్చుకుపోతే వ్యాసం

వాక్యం క్రింద వాక్యం వ్రాస్తే 

కమ్మని కవిత్వం

వచనంలో కవిత్వం

పప్పులో ఉప్పే

కవిత్వమంటే ఒక కలే

ఒక‌ కల్పనే ఒక మసాలే 

 

ఎగిసిపడే

అలలతో ఆడుకున్నట్లు 

కరిగిపోయే

కలల్ని కలవరించినట్లు

గుండ్రనిఅక్షరాలతో 

గుర్రపుస్వారీ చేయవచ్చు

 

అక్షరాలు చెక్కి చెక్కి 

ఒక సుందర శిల్పాన్ని 

అక్షరాలు వ్రాసి వ్రాసి 

ఒక కమ్మని కావ్యాన్ని 

అక్షరాలు చిత్రంచి చిత్రించి 

ఒక అందమైన 

ఒక అపురూపమైన

కంటి ఆకలిని తీర్చే

కడు రమణీయమైన

ఒక దృశ్యాన్ని సృష్టించవచ్చు 

 

పద సౌందర్యంపై 

పద సృష్టిపై దృష్టి పెట్టాలి 

కుండా తయారీకి

మంచి మట్టి కావాలి

భాషపై పట్టు వుండాలి 

 

ఆ ఇంద్రలోకంలో 

సుందర భవనాలను 

మంత్రాలతో మాయలతో 

సృష్టించడం సాధ్యమేమో?

 

ఈ భుమిపై ప్రతి నిర్మాణానికి 

ఇంత ఇటుక ఇంత

సిమెంట్ ఇనుము కావాలి 

ఒక కవిత నిర్మాణానికి సైతం 

ఇంత భాష కావాలి 

ఇంత భావం కావాలి 

కొంత క్లుప్తత కావాలి 

ఊహల్లో స్పష్టత ఉండాలి

 

నిజంగానే నీ కవిత్వం 

నవయవ్వనం కావాలంటే

నవవసంతం పూయాలంటే

పటిష్ఠంగా పసందుగా 

స్థిరంగా చిరస్థాయిగా ఉండాలంటే...