కవిత అంటే....ఒక ఎత్తుగడ...
ఎదను తాకేలా...ఎండలో గొడుగులా
మనసులకు సేదతీరేలా
మనిషిని మనీషిగా మార్చేలా
కవిత అంటే...ఒక శైలి...
సుందరంగా...సుమధురంగా...సుప్రభాతంలా
పండు వెన్నెలలా...తెల్లవారి వెలుగులా
ఇంద్ర ధనుస్సులా...పైరగాలిలా
పక్షుల కిలకిలరావంలా
కవిత అంటే....ఒక వస్తువు...
విభిన్నంగా...వినూత్నంగా...విలక్షణంగా
కవిత అంటే...ఒక కలహంస నడకలా
చిలిపిచూపులా...తేనెపలుకుల
పంచరంగుల...రామచిలకలా
కవిత అంటే....
నాజూకైన...నాట్యమయూరిలా
పదహారణాల తెలుగింటి...ఆడపడుచులా
గోదారి గంగా కావేరి...ప్రవాహంలా
గలగల పారే...సెలయేరులా
జలజలదూకే...జలపాతంలా
కవిత అంటే....ఒయ్యారంగా
ఒంపుసొంపుల...కొంటెచూపుల కోమలాంగిలా
ఎంకి పాటలా...కోయిలమ్మ స్వరంలా
తల్లి ప్రేమలా పాలలా...పసిపాప నవ్వులా
కవిత అంటే....పసందైన
పదసృష్టితో...క్లుప్తంగా...పొందికగా
చిక్కని మజ్జిగలా...కాకినాడ కాజాలా
హైదరాబాద్ దమ్ము...బిర్యానీలా
ఆంధ్రా...ఆవకాయలా
గుంటూరు...గోంగూర పచ్చడిలా
కవిత అంటే...కమ్మని జుంటితేనియలా
మధుర (సం)గీతంలా... వేణుగానంలా
కవితంటే...ఒక అమృతం
ఒక ఔషధం...ఒక ఆక్సిజన్...ఒక అద్భుతం
కవిత అంటే...ముగింపు...ముచ్చటగా
తెలుగు వాకిట్లో...ముత్యాల ముగ్గులా
కిక్కు ఎక్కించే...చివరి పెగ్గులా
మత్తెక్కించే...మరుమల్లియలా
గుబాళించే...గులాబీ పువ్వులా
మురిపించే...ముద్ద మందారంలా
బాపూ బొమ్మలా...రవివర్మ చిత్రంలా
కవిత అంటే...అదొక ఉప్పై
అదొక నిప్పై...రగిలించాలి
కరకుగుండెల్లో కలిగించాలి...కనువిప్పై
విన్నప్రతివారిని కదిలించాలి...వెన్నలా కరిగించాలి
కవిత అంటే.... కరగని కలగా
చెరగని శిలగా...రగిలే అగ్నిజ్వాలగా
కవిత అంటే....ఒక చైతన్యం
ఒక స్పూర్తి... ఒక వెలుగు...ఒక విప్లవం
ఊహించని...ఒక ఉప్పెన...ఒక సునామీ
కవిత అంటే...మరపురాని
మధురమైన మలుపుతో...
విస్మయపరచే విరుపుతో...కొసమెరుపుతో
ఒక చక్కని సందేశంతో...సమాప్తమవ్వాలి
కవితంటే...ఒక భరోసా
భావితరాలకు...ఒక బంగరు భవిత...



