Facebook Twitter
ఆగదు...ఆగదు అంతరంగ మధనం..! అంతరిక్ష అన్వేషణ..!

విశ్వాసం నమ్మకం
ఒక్కటేనా కాదు వేరు వేరు
సత్యము నిజము
ఒకటేనా కాదు వేరు వేరు

ఆత్మ పరమాత్మ
ఒక్కటేనా కాదు వేరు వేరు
ప్రార్థన అభ్యర్థన
ఒక్కటేనా కాదు వేరు వేరు 

మంచి చెడులు
ఎప్పుడు ద్వేషించుకోవు
స్వర్గ నరకాలు
ఎప్పుడూ మూతపడవు
ఎవరికీ కళ్ళకు కనిపించవు...

సూర్యచంద్రులు
ఎప్పుడూ ఏకం కారు ...?
చీకటి వెలుగులు
ఎప్పుడూ తిట్టుకోవు
కొట్టుకోవు...ఎందుకనో
అదొక ప్రకృతి రహస్యం...
అది ఆ సృష్టికర్త శాసనం...

కన్నుమూసి మనిషి
కాటికెళ్ళుట వీక్షించగలం
ఆపై మనిషి స్వర్గానికి వెళ్ళునో
నరకానికెళ్ళునో ఎటువైపు వెళ్ళునో
ఏమై పోవునో ఎవరికీ తెలియదు
ఈ నేలపై చేసిన పాపపుణ్య కర్మలచే ఊహించడం...ఆశించడం
తృప్తి చెందడం...తప్ప

వెళ్ళి చూసి మళ్ళీ వచ్చిన వారు
ఈ భూమి పైన తరతరాలనుండి
ఒక్కరూ కానరారు ఈ నరులు
పుట్టక మునుపు ఎక్కడున్నారో మరణించాక ఎక్కడికెళ్ళుచున్నారో ఎవరికీ తెలియదు...
అది ఒక సృష్టిరహస్యం..!
అది ఛేదించుట ఈ నరునికి అసాధ్యం..!

ఈ భూగోళ ఖగోళ
అంతరిక్ష పరిశోధకుల
సకల శాస్త్ర పండితుల...
మేధావుల...జ్ఞానచక్షువులకు
అందకుండా ఈ పరమసత్యం...
అడ్డుపడుతున్న దెవరో..?
అదృశ్యతెరలు కప్పి ఉంచినదెవరో...?
ఎవరికెరుక సృష్టి స్థితి లయ కారకులైన
ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తప్ప ...!

ఈ భువిలో జన్మించిన నరుని
నడక ఆగదు మరణించే వరకు..!
విశ్వనరుని అన్వేషణ ఆగదు...
అనంత విశ్వంలోని అంతుచిక్కని
అఖండ రహస్యాలను ఛేదించేవరకు..!