ఇది నా సామ్రాజ్యం
నేనొక మహరాజును...
నేనొక చక్రవర్తిని...
నేను ధరించిన కిరీటాన్ని
నేను కూర్చున్న
కనక సింహాసనాన్ని
ఎవరూ కదలించలేరు
నా రాజ్యాన్నెవరూ ఆక్రమించలేరు
నాకు రక్షక భటులున్నారు
నా చుట్టూ ఓ కంచుకోట ఉంది
నన్ను ఓడించి గెలిచేవారు
ఈ భూమి మీదింకా పుట్టలేదు
అంటూ అహంకారంతో
అధికారగర్వంతో విర్రవీగిన ఎందరో
కాలగర్భంలో కలిసిపోయారు
కళ్ళముందే కనుమరుగైపోయారు...
ఇనుము నాశనం
దానికి పట్టిన తుప్పుతోనే...
కంసుని పతనం తాను
చేసిన నూరు తప్పులతోనే...
కర్ణుని అపజయం గతజన్మలో
తాను పొందిన శాపాలతోనే...
అందుకే
ఓ అహంకారీ..!
నీ శతృవులెవ్వరూ
నిన్ను సంహరించరు
నీలోని అరిషడ్వర్గాలే
నీ అంతరంగ శత్రువులు
నీ అంతరంగమే ఓ అగ్నిపర్వతం...
అది ఆరక భగభగమండే ఓ అగ్నిగోళం..
నీవు చేసిన...ఘోరాలకు...నేరాలకు
దారుణాలకు క్రూరమైన కృత్యాలకు
నీ మనస్సాక్షియే నీకు శిక్ష విధిస్తుంది...
నీ గుండెల్లో గునపాలు గుచ్చుతుంది...
నీకు నిత్యం నరకమే నీవొక జీవచ్ఛవమే



