ఊరికి ఉపకారివైతేనే..!
ఒకనాటికి...
"కరిగిపోతోంది" సబ్బుబిళ్ళ
నీ మురికి బట్టల్ని...
నీ మురికి శరీరాన్ని శుభ్రం చేసీచేసీ..!
ఒకనాటికి...
"చిరిగిపోతోంది"...కట్టిన బట్ట...
నీకు అందాన్నిచ్చి...ఆనందాన్నిచ్చి..!
ఒకనాటికి
"విరిగి ఒరిగిపోతోంది"...
పచ్చని చెట్టు...నీకు చల్లని
నీడనిచ్చి...కమ్మని ఫలాలనిచ్చి..!
కొంతకాలానికి...
"కరిగిపోతోంది"...కొవ్వొత్తి
కారు చీకట్లను తొలగించి..!
వెన్నెల వెలుగుల్ని పంచి...!
ఒకనాటికి...కోట్లైనా
"కరిగిపోయేను"కూర్చొని...తింటే..!
ఒకనాటికి...కొండలైనా...
తరిగిపోయేను"త్రవ్వుతూ ఉంటే..!
సాయంకాలానికి...
అలసి పోయిన
సూర్యుడు"అస్తమించేను"...
పగలంతా ప్రపంచానికి వెలుగు
కిరణాలతో ప్రాణశక్తిని ప్రసాదించి..!
అందుకే ఓ మనిషీ తెలుసుకో పచ్చినిజం
సృష్టిలో ఉత్కృష్టమైనది మానవ జన్మని.!
ఊరికి ఉపకారివైతేనే నీ జన్మ సార్థకమని.!



