Facebook Twitter
దాతలు...ధన్యజీవులు..?

జీవితంలో ఏ మనిషి
ఏ గుడికెళ్ళినా కోరుకునే...
వరాలు...ఈ మూడే...
ఏ మనిషి విజయానికైనా
సోపానాలు...ఈ మూడే...
సమయం...ధనం...ఆరోగ్యం..!

ఈ మూడు...
కొందరికి ఆయుధాలు...
కొందరికి తరగని ఆస్తులు...
కొందరు స్వార్థానికే వినియోగిస్తే
కొందరు పరుల శ్రేయస్సుకు వెచ్చిస్తారు

విలువైన...సమయాన్ని...
దుర్వినియోగం చేయడం...
అత్యవసరమైన...ధనాన్ని...
అనవసరంగా ఖర్చు చేయడం...
ఆరోగ్యమే మహాభాగ్యమంటూ...
ఆరోగ్యాన్నే నిర్లక్ష్యం చేయడం...
ఎంతటి అజ్ఞానం..!ఎంతటి అవివేకం..!

నిజానికి ప్రక్కవారు
తింటే...మన ఆకలి తీరదు
కానీ కొందరు పరుల సేవలోనే
అమితానందం పొందుతారు...

అందుకే అంటారు...అనుభవజ్ఞులు...
పరులకెంత పంచినా
తరగనిది "జ్ఞాననిధి"యని...
నరుడే నారాయణుడని...
నరులకు సేవచేయని
వారు నరకానికేనని...
అనాధలకు అభాగ్యులకు
ఆదుకున్న వారి
జన్మధన్యమని...దక్కును పుణ్యమని...

వారే...మహాత్ములు...మహనీయులని...!
వారే...దాతలు ధన్యజీవులు...పుణ్యమూర్తులని...
వారే...చిరంజీవులు...చిరస్మరణీయులని..