Facebook Twitter
ఎంగిలిస్తరాకుకన్న స్టీల్ ప్లేటే మిన్న..!

ఇంత పచ్చగడ్డేసినందుకు
"కృతజ్ఞతగా"...ఒక మూగజీవి
చిక్కని పాలనిస్తుంది
ఇంత తిండి పెట్టినందుకు
"విశ్వాసంతో"...ఒక మూగజీవి
రాత్రంతా ఇంటికి ఇంటియజమానికి
కునుకు తియ్యకుండా కాపలాకాస్తుంది

ఒక "పచ్చని చెట్టు"....
తనను గొడ్డలితో నరికిననేమి..?
నరికే వానికి తాను నేలకు
ఒరిగే వరకు చల్లని నీడ నిస్తుంది

ఎండకు ఎండి
చెట్టుపై నుండి..."ఆకులు"
గాలికి నేల రాలితేనేమి..?
అవి తిరిగి ఇస్తరాకులై
విందుభోజనాలలో అతిథుల
ఆహుతుల ఆకలిని తీరుస్తాయి

వీధిలో చెత్తకుండీలో
"ఎంగిలిస్తరాకుల్ని"...విసిరేస్తేనేమి..?
అవి ఆకలికి అలమటించే
ఎంతోమంది అనాధల అభాగ్యుల మూగజీవుల క్షుద్భాను తీర్చేయును కదా

ఓ మనిషీ నీవు
ఎంగిలిస్తరాకులా...
ఎంగిలి అరిటాకులా...
వద్దు...స్టీల్ ప్లేట్ లా జీవించు
అవి ఆకలితీరాక నిర్ధాక్షిణ్యంగా
వీధిలోకి విసరి వేయబడతాయి

కానీ "స్టీల్ ప్లేట్" నెవరూ
వీధిలోకి విసిరివేయరు
ఆకలి తీరాక శుభ్రం చేసుకుని
భద్రంగా దాచుకుంటారు రేపటికోసం
ఔను ఎంగిలిస్తరాకు...బ్రతుకు కన్న...
ఎంగిలి స్టీల్ ప్లేట్...బ్రతుకే మిన్న...