ఒక కల...
ఏడు రంగుల
ఇంద్రధనస్సులా
అందమైన కల
ఒక కల...పీక
పిసికేసినట్టు పీడకల
ఒక కల...
కొత్త పెళ్ళికొడుకులా
పట్టు పరుపులపై...
పట్టరాని ఆనందంతో...
ఒక కల...
విబేధాలతో విసిగిపోయి
విడిపోయినట్టు విషాదంలో...
ఒక కల...
వెయ్యి రకాల అతి రుచికరమైన
వంటకాలను ఆరగించి అరగక
అవస్థలు పడుతున్నట్టు...
ఒక కల...
ఆకలేసి ఒక అనాధ బాలుడిలా
వీధిలో చెత్తకుండీలో విసిరేసిన
ఎంగిలిస్తరాకులో
మెతుకులు ఏరుకుంటున్నట్టు...
కుక్కలతో కుస్తీ పడుతున్నట్టు...
ఒక కల...
విలాసవంతమైన విల్లాల్లో
ఖరీదైన పూలపాన్పుపై కమ్మని
కలలుకంటూ శయనిస్తున్నట్టు...
ఒక కల...
పూరిగుడిసెలో గుడ్డిదీపం
వెలుగులో గురకలు పెడుతున్నట్టు...
ఒక కల...
గజమాలతో
గజరాజుపై ఊరేగుతున్నట్టు...
ఒక కల...
గుండుకొట్టి బొట్లుపెట్టి గాడిదమీద
ఎందుకో ఊరంతా ఊరేగిస్తున్నట్టు...
ఒక కల...
కోటీశ్వరుడిలా
బిల్ గేట్స్ లా
ఒక కల...
వీధిలో బిక్షగాడిలా
ఒక కల...
ఆరోగ్యవంతుడిలా
ఒక కల...
అస్థి పంజరంలా
ఒక కల...
ఘనవిజయం
సాధించిన...
విశ్వవిజేతలా...
ఒక కల...
ఘోర పరాజయం
పొందిన...పరాజితలా...
ఒక కల...
చిరునవ్వుల వెలుగులో...
ఒక కల...చింతల చీకటిలో...
కలగన్నాను నేను ఒక కలగన్నాను...



