ఓ మనిషీ..!
ఇకనైనా...ఈ కంప్యూటర్
యుగంలోనైనా...
కళ్ళు తెరిచి నిజం తెలుసుకో...
నీ అవివేకం...నీ బలహీనత...
నీ అహంకారం...
నీ సంస్కృతీ సాంప్రదాయం...ఏది?
ఎప్పుడు మారేను నీ మనస్తత్వం..?
ఎక్కడ దాక్కుంది నీ సంస్కారం..?
వెతికి వెతికి పట్టుకో...
నీ వ్యక్తిత్వదీపాన్ని వెలిగించుకో...
నిన్న మరుమల్లెలా పరిమళించి
నేడు మటుమాయమైపోయిన
నీ మంచితనం...నీ మానవత్వం...
నీ సహనం...నీ సమతా నీ మమత
నీ దయ నీ కరుణ...నీ ప్రేమ నీ జాలి
ఆ సుగంధభరిత సుగుణాల
సుమాలన్నీ ఏ ధూళిలో కలిశాయో..?ఏమైపోయాయో..? ఎవరికెరుక..?
ఓ మనిషీ..!
ఎందుకిలా మోడువారిన చెట్టులా
మిగిలావో..? ఆలోచించు ఒక్కసారి...
ఓ మనిషీ..!
నీవెప్పుడు మళ్ళీ చిగురిస్తావు..?
ఓ మనిషీ..!
నీవెందుకిప్పుడు
మోడువారిని
చెట్టులా మిగిలిఉన్నావు
కాయలు పండ్లు లేవు
ఆకలి తీర్చడానికి...
కొమ్మలు రెమ్మలు లేవు
పక్షులు గూడుకట్టుకోవడానికి...
పచ్చని ఆకులు లేవు
ఆక్సిజన్ అందించడానికి...నీచెంత
శయనించేవారికి...సేదతీరేవారికి
చల్లని నీడనివ్వడానికి...ఏమైంది..?
ఎందుకిలా మారిపోయావు..?
ఓ మనిషీ..!
ఎప్పుడు మళ్ళీ నీవు చిగురిస్తావు..?
చిగురించడం...
నీ చేతిలో లేదని చింతించకు..!
నిజమే విత్తనమై మట్టిలో
కూరుకుపోవడం వరకే మనిషి పని..!
ఆపై మొక్కగా మొలకెత్తడం..!
పంచభూతాలను
రక్షణ కవచంగా నిలిపి...
పచ్చని చెట్టుగా...
మనిషిని మార్చడం ఆ పరమాత్మ పని..!



