Facebook Twitter
ఆ చిట్టి చెల్లికేమైంది..?

1...

ఎన్నో ఏళ్ళు... 

ఎన్నో నోములు నోస్తే... 

ఎన్నో వ్రతాలు పూజలు చేస్తే...

ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగితే... 

ఎందరో దేవుళ్ళకు దేవతలకు మ్రొక్కితే...

మొక్కులు చెల్లిస్తే... 

అష్టకష్టాలు పడితే...

పొర్లు దండాలు పెడితే... 

ఎన్నో రాత్రులు కన్నీటి ప్రార్థనలు చేస్తే... 

లేకలేక పుట్టింది...

మా ఇంట అడుగుపెట్టింది...

మా పాప మా ఇంటి బంగారం... 

మా ఇంటి మహాలక్ష్మి... 

అంటూ మురిసిపోయింది ఓ జంట

మా ఇంటి ప్రక్కన రోజు మా బాబుతో 

ఆడుకునే ఆ మహాలక్ష్మి 

ఒకరోజు వెక్కివెక్కి ఏడుస్తుంటే...

అడిగాడు నా మనవడు 

ఆ చిట్టిచెల్లికి ఏమైంది తాతయ్యా..?అని 

పాపం పది వీధికుక్కలు మీదపడి రక్కాయనని... 

ఒళ్ళంతా రక్తసిక్తమైందని...

చెప్పా అయ్యో పాపం అన్నాడు 

2...

కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే ప్రశ్న... 

ఆ చిట్టిచెల్లికి ఏమైంది తాతయ్యా..?అని

పాపం అందర్ని నమ్మే ఆ పసిపాప 

ఈసారి కామాంధుల కోరలకు బలైందని...

ఏమని చెప్పను..?ఎలా చెప్పను..? 

ఆ పసివాడికి...ఆపై... 

ఊరి పెద్దలు పంచాయితీ చేశారని... 

కొంత సొమ్ము ఆశచూపారని...

ఆ తల్లిదండ్రుల గొంతునొక్కారని...

ఎఫ్ ఐ ఆర్ బుక్ చేయకుండా 

చేతులకు సంకెళ్ళు వేశారని...

ఎలా చెప్పను..? ఏమని చెప్పను..?

3...

కొనేళ్ళ తరువాత మళ్ళీ అదే ప్రశ్న...

ఆచిట్టిచెల్లి తల్లికేమైంది తాతయ్యా...అని

కన్న కూతురు చేదు 

జ్ఞాపకాలతో బ్రతకలేక... 

అవమానాలు భరించలేక... 

ఆ కామాంధులనెదురించలేక... 

నిద్రరాక నిద్రమాత్రలు మింగి... 

శాశ్వతంగా నిద్రలోకి జారిపోయిందని... 

ఎలా చెప్పను..? ఏమని చెప్పను..?

ఆ కామాంధులు 

చట్టాన్ని సైతం 

చెరబట్టగల సమర్థులని... 

అధికార బలమున్న 

అహంకారులని... 

పేద కుటుంబాల్ని 

కూలదోచే పరమకిరాతకులని... 

చట్టాలే చేతులెత్తేస్తే...? 

కంచే చేను మేస్తే..? ఈ నిరుపేదలకు 

ఈ నిజమైన బాధితులకిక దిక్కెవరని..? 

ఎలా చెప్పను..? ఏమని చెప్పను..?

ఆ వీధికుక్కలకు బడితపూజ చేయవచ్చు

కళ్ళుపొరలు కమ్మని ఈ కామాంధులను...

ఈ ఉన్మాదులను...ఈ పిచ్చికుక్కలను...

ఊరి మధ్యలో ఉరి తియ్యడమే ఉత్తమం