1...
నేను పుట్టినప్పుడు...
అమ్మా నాన్నల్ని అడగలేదు
నా జాతకం చూడమని...
నాకొక మంచి పేరు పెట్టమని...
నేను అమ్మను
అడగలేదు...అమ్మా పాలిమ్మని...
రాత్రివేళ నేను కేకలు వేయలేదు
అమ్మా...నా ఆకలి తీర్చమని...
నేను అమ్మను అర్థించలేదు
అమ్మా...నాకు
చందమామను అందించమని...
నేను అమ్మను అడగలేదు...
నాకు జలుబుచేస్తే జబ్బుచేస్తే
డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టమని...
నేను నాన్నను కోరలేదు
ఊరిబడికి నన్ను పంపించమని...
కానీ...
నన్ను బడికి పంపిన
అమ్మానాన్నలు...ఏం చేశారు..?
ఎర్రనిఎండలో మాడిపోయారు
ఎందుకు..?
నా కడుపు నింపేందుకు...
నన్ను ఉన్నత చదువులకై
విదేశాలకు పంపించేందుకు...
2...
నేను నాన్నను అడగలేదు
నన్ను అమెరికా పంపమని...
వారే విమానంలో పంపారు
ఉన్నత చదువులు చదవాలని...
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను కావాలని...
అమ్మా నాన్నలు తపించారు
తలకు మించిన అప్పులు చేశారు...
ఆ అప్పుల నిప్పుల్లో
దహించుకు పోయారు
కారుచీకటిలో కన్నీరు కార్చారు
ఆత్మహత్యా ప్రయత్నం చేశారు
నా మా బంగారు భవిష్యత్తు కోసం
అమ్మానాన్నలు నరకాన్ననుభవించారు
నేను అమ్మానాన్నలను అడగలేదు
నాకు అందమైన భార్య కావాలని...
వారే ఎన్నో సంబంధాలు వెతికి...
నచ్చిన భాగస్వామితో అంగరంగ
వైభవంగా కళ్యాణం జరిపించారు
ఈ సమాజంలో ఒక గౌరవప్రదమైన విలువైన జీవితాన్ని నాకు ప్రసాదించారు
3...
ఇప్పుడు వారు వృద్ధాప్యంలో ఉన్నారు
వారిద్దరు నేడు నన్ను ఆశతో అడిగేది
కన్నీటితో ప్రాధేయ పడేది ఒక్కటే...
తమను అనాధశ్రమంలో చేర్చవద్దని...
అనాథలుగా...ఆకలితో అలమటించే
అస్థిపంజరాలుగా తమను మార్చవద్దని...
కానీ నేను చేసిందేమిటి..?
నాకు కన్నవారికన్నా
కట్టుకున్నదే మిన్నగా కనిపిస్తున్నది..?
భార్య పోరు భరించలేక విధిలేక
అమ్మానాన్నలను అనాధాశ్రమానికి అతిథులుగా తరలించక తప్పలేదు
అమ్మానాన్నలారా...నన్ను క్షమించండి
ఓ దైవమా..! నేను
నా ప్రత్యక్ష దైవాలకు శిక్ష వేశాను.?
తెలిసిచేసిన ఈ తప్పుకు నన్ను శిక్షించండి
నేను కన్నబిడ్డను కాను..ఒక కసాయివాన్ని



