అర్థం లేని బ్రతుకు వ్యర్థం
కనులున్నా
కానరానినాడు...
చెవులున్నా
వినలేనినాడు...
తిండేమి
తినలేనినాడు...
కర్రలేక నడవలేనినాడు...
ఆకలి ఆరనినాడు...
ఆశలు తీరనినాడు...
చేతిలో డబ్బులు
లేనినాడు...
వచ్చిన జబ్బులు
ఎంతకూ పోనినాడు...
ఆదరించేవారు
కరువైననాడు...
అందరికీ నీవు
బరువైననాడు...
కాటికాడి కాకులు
రమ్మంటుంటే...
కడుపున పుట్టిన బిడ్డలే
కాటికి పొమ్మంటుంటే...
ఈ జీవికిక్కడ విలువెక్కడ..?
బ్రతుకు భారమై...అంధకారమై...
సుఖశాంతులు దూరమైననాడు...
ఇంకా ఈ బ్రతుకెందులకో అర్థం కాదు ...
గూటిలోని గువ్వ ఎగిరిపోదెందులకో..!
ఎవరూ కాదనలేని సత్యమొక్కటే...
ఆరిపోయే దీపానికి ఆశ ఎక్కువే...
బ్రతుకు మీద కాసింత తీపి ఎక్కువే...!



