Facebook Twitter
మంచిని పంచడమే...మానవత్వం..!

ట్రాన్ఫర్లు...
ప్రమోషన్లు లేని
ఉద్యోగ మెక్కడిది..?

లాభనష్టాల కష్టాలు
ఎరుగని వ్యాపారమేది..?

రేయింబవళ్ళు దుక్కిదున్ని
రెక్కలు ముక్కలు చేయక...
స్వేదం చిందించక వ్యవసాయమేది..?

కలతలు...కన్నీళ్లు...
అలకలు...అపార్ధాలు
చింతలు...చీకాకుల్లేని సంసారమేది..?

అలల తాకిడి‌...అల్లకల్లోలం లేని
కడలి కాదురా...ఈ‌ మనిషి జీవితం

జీవితమంటే ..?అడగడుగున
గండాలే...అగ్నిగుండాలే...
సుఖదుఃఖాల సుడిగుండాలే...

సమస్యలన్నవి మనిషికి సహజం
బెల్లానికి ఈగలు ముసిరిన వైనంగా...

ప్రతి ఊరికి...దారి ఉంటుంది
ప్రతి చెట్టుకు...వేరు ఉంటుంది
ప్రతి మనిషికి...పేరు ఉంటుంది
ప్రతి సమస్యకు...పరిష్కారముంటుంది

ఔను ఆపదలో ఉన్నవారిని
ఆదుకోవడమే...దాతృత్వం..!
మంచిని పంచడమే...మానవత్వం..!
సమస్యలను జయించడమే...ధీరత్వం..!
దిక్కులేని వారినుద్దరించడమే...దైవత్వం!