Facebook Twitter
నేడు తల్లిగర్భంలో… రేపు కాలగర్భంలో....

నేడు తల్లిగర్భంలో పుట్టి
రేపు కాలగర్భంలో కలిసిపోయే
ఈ మట్టి మనిషి
తన జ్ఞానంతో ఆర్జించిన విజ్ఞానంతో
ప్రకృతిలోని పంచభూతాలను సైతం
ఒకఆట ఆడించగలనని తలపోస్తున్నాడు

నిజానికి...
ఈ రెండుకాళ్ళ వింతజీవి
ఒక విజ్ఞాని కాదు ఒక అజ్ఞానే...

ఎందుకు...?
తన ప్రాణదాతకే...
సవాలు విసురుతున్నందుకు...
సృష్టికి ప్రతి సృష్టి చేయగలనని
ప్రగల్భాలు పలుకుతున్నందుకు...
తానొక అఖండజ్యోతినని అనంత
శక్తి సంపన్నుడనని విర్రవీగుతున్నందుకు...

నిజానికి ఈ అహంకారి
ఈ బహుదూరపు బాటసారి
గాఢాంధకారంలో
తిరిగే ఒక గబ్బిలమే...ఎందుకు...?

తనొక పాత్రధారినని...
సూత్రధారియైన కాలం చేతిలోనూ
తాను సృష్టించిన ధనం చేతిలోనూ
తానొక కీలుబొమ్మనన్న...
ఒక నగ్నసత్యాన్ని గ్రహించకున్నందుకు...