దయగల ఓ దైవమా..!
నా కన్నవారికి నేను
కడుపునిండా తిండిపెట్టే
శక్తిని నాకిమ్మని భక్తితో నివేదిస్తున్నా...
వారిని ఏ మొండిరోగం
అనకొండలా పట్టి పీడించరాదని...
వారి వార్దక్యం వారికి శిక్ష కారాదని...
వారికీ నేలపై నరకం చూపించరాదని...
వారి ఆశలు ఆశయాలు...ఆరిపోరాదని
వారి మనసు పాలలా......విరిగిపోరాదని
వారి ముఖాన చిరునవ్వు చెరిగిపోరాదని
వారి గుండెల్లో ఆనందం...తరిగిపోరాదని
వారి తలంపుల్లో
మృత్యువు విహరించరాదని...
కలలో సైతం కనిపించరాదని...
వారుదాన్ని కలవరించరాదని...
నిత్యం వారికళ్ళకు తమ పిల్లల
బంగారు భవిష్యత్తు దర్శనమివ్వాలని...
కన్నుమూసి కాటికి చేరేలోపు
కలతనిద్ర లోనైనా ఒక్కసారి
మీ దివ్య మంగళ రూపం
వారి...కళ్ళకు కనిపించేలా...
మీ తియ్యని ఆఖరి పిలుపు
వారి...చెవులకు వినిపించేలా...
వారికిదే మీరు అందించే
అపురూపమైన వరమని
వారికి అవగాహన కలిగేలా
వారిని దీవించమని...
ఇంతవరకు ఈ జీవితంలో
చేసిన "యుద్దం" చాలని
ఇక మీలో ఐక్యమయ్యేందుకు
వారిని "సిద్దం" చేయమని...
ఓ దయగల దైవమా..!
నేడే నేను మిమ్ము
ఆశతో అర్ధిస్తున్నా...
కన్నీటితో ప్రార్థిస్తున్నా...
వేదనతో వేడుకుంటున్నా...
మనసారా కోరుకుంటున్నా...



