పిట్టల పొట్టలు నింపండి
సిగ్గు లజ్జా లేకుండా
బొజ్జలు పెంచుకునే
ఖరీదైన వంటకాలతో
కడుపులు నింపుకొనే
పిల్లికి ఇంత బిక్షం వేయని
ఓ పిసనారులారా !
పిడికెడు బియ్యపు గింజలు
విసిరినా చాలునే
చెట్టు మీదున్న పది పిట్టలు
పొట్టలు నిండును కదా
ఇకనైనా ఈ రోజు నుండైనా
వారంలో ఒకరోజైనా
చెత్తకుండీ లదగ్గర
కుక్కలతో కుస్తీ పడుతూ
ఎంగిలి విస్తరాకుల్లో
మెతుకులు ఏరుకొనే
అనాధల పిల్లల,
దిక్కూమొక్కులేక
అడుక్కుతినే వృద్దుల
ఆకలిని తీర్చండి
వీధుల్లో తిండిలేక తిరిగే
మూగజంతువుల మీద
కాసింత కనికరం చూపండి
ఉదయం లేచింది మొదలు
ఎవరిమీద ఆధారపడకుండా
ఆహారాన్ని వెతుక్కుంటూ
ఎన్నో మైళ్ళ దూరం వెళ్ళి
చీకటి పడగానే గూటికి చేరే
చెట్లమీద పక్షులకోసం వెతకండి
ఆ మూగజీవుల
ఆకలిని దాహాన్ని తీర్చండి
చాలు ఈ భూమి మీద
ఇక మీ జన్మ ధన్యమే
మీకు తప్పక దిక్కు
పదిజన్మల పుణ్యఫలమే



