Facebook Twitter
నిజానికి నిజమైన స్నేహితులెవరు

మనకు కష్టం వచ్చిందని
కబురు అందగానే తక్షణమే
రెక్కలు కట్టుకుని వాలేవారు

మనల్ని ఆపదలో ఆదుకొనేవారు
మన కంటకన్నీటిని తుడిచేవారు

మన బాధని తమ
బాధగా భావించేవారు
మన తప్పులకు తాము
శిక్ష అనుభవించడానికి
చిరునవ్వులు చిందిస్తూ
సిద్దమయ్యేవారు...

మన తప్పును మనకు చెప్పి
మన మనసు‌ గాయపడకుండా
సకాలంలో సహనంతో
సమయస్ఫూర్తితో సరిదిద్దేవారు...

మనం చితికి చేరేవరకు
మన వెంటే నీడలా నడిచేవారు...

కానీ...
మన బలహీనతల్ని
పరులకు చెప్పి మన
గౌరవాన్ని తాకట్టుపెట్టేవారు...
మన పరువును గంగలో
కలిపేవారు...నలుగురిలో
మనల్ని నవ్వులపాలు చేసేవారు..

మన వెనుక గోతులు
త్రవ్వేవారు...నయవంచకులే...
మన పతనాన్ని
కోరుకునే మన బద్దశత్రువులే...
మన కాళ్ళకు
చుట్టుకున్న కాలసర్పాలే... 

కొన్ని సార్లు నల్లవన్నీ
నీళ్ళు కాకపోవచ్చు...
తెల్లవన్నీ పాలుకాకపోవచ్చు...
మన పక్కనున్నవారు మన
ప్రాణస్నేహితులు కాకపోవొచ్చు...
మనకు ప్రక్కలో బల్లెం కావొచ్చు...

ఎక్కువగా నమ్మినవారినే
కదా ఎవరైనా మోసం చేస్తారు...
పండిన చెట్టునుండే
కదా ఎవరైనా కాయలు కోస్తారు...
అట్టివారు మన ప్రాణమిత్రులైనా
వారు మనకు అనుకూలశత్రువులే...

అవసరాలకు
వాడుకొని వదిలేసేవారు...
చిరునవ్వులు చిందిస్తూ
గుండెల్లో చితిమంటలు రేపేవారు...
సహాయం చేయగలిగీ చేతులు ముడుచుకునేవారు...
నిజమైన స్నేహితులు కానే కారు...

అందుకే ఎవరినీ
తలపై కెక్కించుకోరాదు...
భుజాలపైన మోయరాదు...
ఎవరినీ అతిగా నమ్మరాదు...
మేధావుల...అనుభవజ్ఞుల...
మానసిక శాస్త్రవేత్తల సందేశమొక్కటే...
Trust anybody on earth
But verify their worth...
అని...

ఔను నిప్పులాంటివారే...
నీతి నిజాయితీ గలవారే...
మన అభివృద్ధిని ఆకాంక్షించేవారే...
నిత్యం మన శ్రేయస్సును కోరేవారే...
నిజానికి నిజమైన మిత్రులంటే...మరి
మీ మిత్రులతో కాసింత జాగ్రత్త...సుమీ