భ్రమ లో మనిషి భ్రమరంలా
కొందరు
మేధావులు
అన్వేషణలతో
అధ్యయనాలతో
పరిశోధనలతో కాలాన్ని
సద్వినియోగం చేసుకుంటారు
కొందరు మూర్ఖులు
చెడు వ్యసనాలతో
అతినిద్రతో కలహాలతో విలువైన
ఖరీదైన కాలాన్ని వృధాచేసుకుంటారు
కానీ కాలమెప్పుడూ తీరం దాటదు
ఋతువులు మాసాలు వారాలు
దినాలు కాలం కౌగిలిలోనే ఉంటాయి
చెడు జరిగితే అది చెడు కాలం
మంచి జరిగితే అది మంచి కాలం
అన్న "భ్రమ" చుట్టూ మనిషి
ఒక భ్రమరంలా తిరుగుతాడు
లేనిదేదో ఉందనుకుంటాడు
ఉన్నదేదో లేదనుకుంటాడు
నరుని దృష్టి ఎలా ఉంటే
అలాంటి దృశ్యమే కనిపిస్తుంది
మనిషి కాలరహస్యాల్ని ఛేదించాలంటే
పాదరసంలా జారిపోయే కాలాన్ని
పట్టుకొని సద్వినియోగం చేసుకోవాలి
కాలం నిశ్శబ్దంగా నిశ్చలంగా
తన పని తాను చేసుకుపోతుంది



