Facebook Twitter
ఒంటెలా ఎడారిలో ఒంటరిగా...?

అనుకోకుండా
ఆకస్మాత్తుగా పిడుగులా
మీద పడే ఆపదలో
ఆదుకునే...ఆపద్బాంధవులను...

నీ బాధలను వ్యధలను
తమవిగా భావించి
నీ కష్టాలను పంచుకునే కన్నీళ్లను
తుడిచే...బంధుమిత్రాదులను...

నీవు సమస్యల
సుడిగుండంలో చిక్కుకుని సతమతమయ్యేవేళ...
తప్పించుకునే దారిలేక...
ఉక్కిరిబిక్కిరయ్యేవేళ...
సకాలంలో స్పందిస్తూ...
సరైన సలహాలనందిస్తూ...చక్కని
పరిష్కారమార్గాల్ని చూపిస్తూ...నిత్యం
నీ మేలు కోరే...నీ ప్రాణస్నేహితులను... 

అడుగడుగున
నీ అభివృద్ధిని...
నీ శ్రేయస్సును...
నీ సంక్షేమాన్ని...
ఆశించే...ఆకాంక్షించే...
నిత్యం నీ గుండెల్లో
కొండంత ధైర్యాన్ని నింపే...
అవసరమైతే అదృశ్యంగా
నీకు అభయ హస్తాలనందించే
ఆ పరమాత్మకు
ప్రతిరూపాలైన...ఆత్మీయులను...

జీవితంలో ఎప్పుడూ
చిన్నచిన్న పంతాలకు
పట్టింపులకు పోయి...
దూరం చేసుకోకు...
దుఃఖించకు...
ఒంటెలా ఎడారిలో
ఒంటరిగా మిగిలిపోకు...

ఈ ఒక్క జీవితసత్యాన్ని
గుర్తించిన...ఆచరించిన...
వారే అదృష్టవంతులు...
వారే చిరస్మరణీయులు...
వారే చరిత్రలో చిరంజీవులు....
వారే అందరికీ ఆదర్శప్రాయులు...