పండిన...ప్రతి పండు...
వాడిన...ప్రతి పువ్వు...
ఎండిన...ప్రతి ఆకు.....
తప్పక నేలరాలిపోతుంది
పచ్చని కాపురం
సైతం ఒక పచ్చని చెట్టే
పెళ్ళైన కొత్తలో ఆ చెట్టు ఉంటుంది
పచ్చపచ్చగా...పదిమంది మెచ్చగా
పెళ్లికి ముందు భార్యా భర్తలిద్దరు
తడిసి ముద్దౌతారు ప్రేమ వర్షంలో...
కాస్త కడుపు పండగానే...
పాపో బాబో పుట్టగానే...
ఒకరిపై ఒకరికి అనురాగం...
తరిగిపోతుంది తగ్గిపోతుంది
ఆ ప్రేమ పిల్లలపై కెళ్ళిపోగ
అప్పుడే భార్యాభర్తల మధ్య
అంతులేని అగాధాల లోయలు...
అర్థం లేని అపార్థాల మంటలు...
అలా ప్రేమ తరిగినప్పుడు...
మనసు కాస్త విరిగినప్పుడు...
ఆవగింజంతైనా అర్థం
చేసుకునే మనసే లేనప్పుడు...
ఆకాశమంత ప్రేమచూపడం వ్యర్ధమే...
ఆ వ్యధను ఆ బాధను
భార్యా భర్తలు కొందరు
కన్నీటి చుక్కలతో చెప్పేస్తారు...
కొందరు చిరునవ్వులతో కప్పేస్తారు...
కానీ గుండెల్లో రగులును అగ్నిపర్వతాలు...



