Facebook Twitter
అమాయకపు"అమ్మలు"… ఆడే కీలు బొమ్మలు..?

సక్రమమైన ప్రవర్తనలేని
అక్రమ సంబందాలన్నీ
ఎంతటి వికృతమైనవో
ఊహకతీతం...అమానుషం...

కొందరు విచిత్రంగా
పెళ్ళైన తర్వాత
పిల్లల్ని కన్నతర్వాత
భర్తలే ప్రత్యక్ష దైవాలంటారు
నిత్యం పూజలు చేస్తుంటారు

కాని...మాయమాటలతో
మత్తెక్కించే మాయగాళ్ళను
కమ్మని కబుర్లు చెప్పి
కవ్వించే కసాయివాళ్ళను

కాల్చిన సిగరెట్టును కాలికిందేసి
నలిపేసే నయవంచకులనే...
ఏరుదాటి తెప్పతగలేసే...
వాడుకొని వదిలేసే...
కళ్ళు పొరలు కమ్మిన
కామాంధులనే నమ్ముతారు
చచ్చేంతగా...ప్రాణాలిచ్చేంతగా...

ఆపై కన్నవారి కట్టుకున్నవారి
కళ్ళుగప్పి ప్రేమికుల చుట్టే
బరితెగించి తిరుగుతారు...
వారి మాయలో... మత్తులో పడి
చేతుల్లో కీలు బొమ్మలై...
ఆడించినట్లు ఆడతారు...
అడిగినవన్నీ ఇచ్చేస్తారు...

ఆకలి తీరిన తర్వాత
ఎంగిలి ఇస్తరాకల్లే వీధిలో
విసిరే స్తే...విధిలేక చేసేదిలేక
ఎవరికీ ఏమీ చెప్పుకోలేక...
అవమానాలను భరించలేక...

పాపం పుట్టిన పిల్లల
బంగారు భవిష్యత్తు
బుగ్గి పాలవుతుందని...
తమపై ఆధారపడిన
వారందరూ అనాధలౌతారని...
రెండు కుటుంబాల
పరువు గంగపాలౌతుందని...
తెలిసీ...తెలిసీ...తెగించి...

ఒక్కక్షణమైనా
ఆలోచించక 
దిక్కుతోచని దీనస్థితిలో...
ఆవేశంలో...క్షణికావేశంలో...
ఏ ఫ్యానుకో ఉరివేసుకొని...
ఏ బిల్డింగ్ పైనుండో దూకి...
ఆత్మహత్య చేసుకుంటారు...
ప్రాణాలు తీసుకుంటారు...
అభం శుభం ఎరుగని...
అన్యం పుణ్యం తెలియని...
అమాయకపు "అమ్మలు" కొందరు...

చచ్చిసాధించే దేముంది ?
కన్నవారికి గుండెకోత తప్ప...
చావు సమస్యకు పరిష్కారమా..?
కాదే బంగారంలాంటి
బ్రతుకు బలైపోవడం తప్ప...