ఇంద్రియాలలో
నయనాలు ప్రధానం...
ఆ కళ్ళుఇచ్చేెటి సందేశమొక్కటే...
కళ్ళురెండైనా చూపు ఒక్కటేనని...
కాలికి ముళ్ళు గ్రుచ్చుకున్నా
కనిపించని మనసుకు గట్టి గాయమైనా
కన్నీటి ధారలు రెండు కళ్ళనుండేనని...
ఒక కన్ను ఏడిస్తే మరోకన్ను నవ్వదని...
నవ్వైనా ఏడ్పైనా కళ్ళకు సమానమేనని..
ఎంతటి దూర ప్రయాణమైనా
ఒక్కఅడుగుతోనే ప్రారంభం..
అట్టి కదిలే పాదాల సందేశమొక్కటే...
పాదాలు రెండైనా...లక్ష్యమొక్కటేనని...
ఆగక అలసిపోక గమ్యం చేరడమేనని...
ఒక్కడుగు ముందున్న కాలు గర్వపడదని...
ఒక్కడుగు వెనకున్న కాలికి చింతలేదని...
మరొక్కడుగుతో ఆరెండు
పాదాలు తారుమారౌతాయని...
భార్యా భర్తలిద్దరు
సంసార రధానికి రెండు చక్రాలు...
జతగా...జన్మజన్మలకు జంటగా...
పదికాలాలపాటు పచ్చగా
కలకాలం కనులపంటగా...
కలిసి మెలిసి ప్రశాంతంగా
జీవించాలనుకునే పుణ్యదంపతులకు
ఇంద్రియాలే ఇంద్రభవనాలు...
ఇంద్రియాలే ఇంటికి ఇంద్రధనుస్సులు...
ఈ ఇంద్రియాల దివ్య సందేశమొక్కటే...
చూపులకిద్దరైనా వారు అర్థనారీశ్వరులని...
వాటిసందేశమే సంసార సంగీత సారమని...
ఆ సంసార సందేశమే
భార్యాభర్తలకు భగవద్గీతని..



