వరమొక్కటే..! ఆయుధమొక్కటే..!
మనిషికి
వివేకం విచక్షణ
సమయం సంపద
వినయం విధేయత
స్వేచ్చ స్వాతంత్ర్యం
శక్తి యుక్తి...అన్నీ ఉన్నా
బాల్యంలో... కొంతకాలం
అమాయకత్వంతో...
ఆధారపడేతత్వంతో...
అమ్మానాన్నల చేతుల్లో మనం
బంధీలమే...ఆటబొమ్మలమే..!
"యవ్వనంలో"...
సమయం సంపద
స్వేచ్ఛ స్వాతంత్ర్యం
శక్తి యుక్తి పుష్కలంగా ఉన్నా
చేతిలో "సంపద" శూన్యమే..!
"మధ్య వయసులో"....
ఉరుకు పరుగుల జీవితంలో
అన్నీ పుష్కలంగా ఉన్నా...
"సమయం" శూన్యం.!
"వృద్ధాప్యంలో"....
సర్వం మన పాదాక్రాంతమైనా
అన్నీ పుష్కలంగా ఏ కొరతలేకున్నా
యుక్తి ఉన్నా "శక్తి" శూన్యం..!
ఇది కదా జీవితమంటే...
ఇది కదా అర్థం కాని
ఆ జీవిత పరమార్థమంటే...
ఇది కదా దైవశాసనమంటే...
ఆ దైవం వరాలెన్ని ఇచ్చిన
అనుభవించేది ఒకే...వరం...
ఆయుధాలెన్ని ధరించినా
సమయానికి సమయస్ఫూర్తితో
సంధించేది ఒకే...ఆయుధం...



