నేడు...
ఉన్నదంతా తినేస్తే..!
రేపు తిన్నదంతా
కక్కేయాల్సి వస్తుంది
నేడు...
చూసిందంతా కావాలని
పేదోళ్లను అమాయకులను
దోచేస్తే...నేలమాళిగల్లో దాచేస్తే..!
రేపు చీమలు పెట్టిన పుట్టలు
పాముల పాలైనట్లు ఆశతో
అత్యాశతో ఆర్జించిన ధనమంతా
పరులపాలైపోవుట పచ్చినిజం...!
నాదినాది అంటూ
కోట్ల ఖరీదు చేసే
వేల ఎకరాల భూమిని
అక్రమంగా ఆక్రమించుకుంటే..?
భూదేవి పక్కుమని నవ్వుతుంది..
ఎంత ఆర్జించినా ఏదీనీది కాదని...
ఒక్క"ఆరడుగుల స్థలమే" నీదని...
పోయేప్రాణం ఎలాగూ పోతుంది
ఎందుకీ భూ పోరాటం..?
ఎందుకీ ఆస్తుల ఆరాటం..?
చిరంజీవిగా చిరకాలం జీవించాలని...
ఎందుకీ కాకి గోల ? అంటుంది నేల..!
గుండెలనిండా ఆశ ఉండాలి...
"ఆశే మనిషికి శ్వాస" కావాలి...
కానీ "అత్యాశ" ఉండరాదు అది
మన జీవితాల్ని "అంతం" చేయరాదు...
ఆశతో సాగే నీ
జీవితం ఒక స్వర్గమే..!
అత్యాశకు ప్రతిఫలం నరకమే..!
అత్యాశతో జీవితం అంధకారబంధురమే..!
అర్థంలేని జీవితం వ్యర్థమే అత్యాశ అనర్థమే



