Facebook Twitter
ధనమే...దైవం !

డబ్బును...
వెక్కిరించేవారు
డబ్బుంటే లెక్కలేనివారు
అప్పులపాలౌతారు
ఆకలికి అలమటిస్తారు
ఆత్మహత్యలకు గురౌతారు
చివరికి కుక్కచావు ఛస్తారు

డబ్బుంటే...
భయం లేనివారు
చిన్నచూపు చూసేవారు
భారీగా నష్టపోతారు
బంధువులకు దూరమౌతారు
నలుగురిలో నవ్వులపాలౌతారు
పదిమందిలో పరువుగా బ్రతకలేరు

డబ్బును...
నిర్లక్ష్యం చేసేవారు
నీళ్ళలా ఖర్చుచేసేవారు
అభివృద్ధి చెందలేరు
ఆస్తులు ఆర్జించలేరు
గౌరవములేని గడ్డి పోచలౌతారు
గుడిశలో వెలిగే గుడ్డి దీపాలౌతారు

ఈ ధనమే...
మా ప్రాణం అనుకునేవారు
దైవంలా నిత్యం పూజించేవారు
నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు
నలుగురిని ఆపదలో ఆదుకుంటారు
నవ్వుతూ నాలుగు రోజులు హాయిగా
ప్రశాంతంగా  ఆనందంగా బ్రతుకుతారు